Jump to content

వికీపీడియా:శైలి/ప్రవేశిక

వికీపీడియా నుండి
వికీపీడియా శైలి సహాయం

శైలి
ప్రవేశిక
భాష
మార్గదర్శక, విధాన నిర్ణయాలు
సినిమా వ్యాసం
లింకులివ్వడం

దిద్దుబాటు మార్గదర్శకాలు

వర్గీకరణ
వ్యక్తుల వర్గీకరణ
మూలాలను పేర్కొనడం
బయటి లింకులు
నామకరణ పద్ధతులు
జాబితాలు
మొలకలు

ఇతర మార్గదర్శకాలు

పదకోశం
దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి
నామకరణ పద్ధతులు
బొమ్మల పాఠం
విభాగం

వికీపీడియాలో ప్రవేశిక అనేది వ్యాసానికి పరిచయం వంటిది. వ్యాసం లోని అతి ముఖ్యమైన విషయాల సారాంశం అది. ఇది వ్యాసం ప్రారంభంలో, మొదటి విభాగానికి ముందు ఉంటుంది. ఇది వార్తాపత్రికల్లో వార్తలకు ఇచ్చే లీడ్ వంటిది కాదు.

వికీపీడియాలో సందర్శకులు సాధారణంగా చూసే పేజీలు సమయం కొన్ని నిమిషాలు ఉంటుంది (ఆ సెషన్‌లో పేజీలన్నీ కలిపి).[A] చాలా మంది వ్యాసంలో మొదట చదివేది ప్రవేశిక. అసలు చదివేది అది ఒక్కటే కావచ్చు కూడా.[B] ప్రవేశికలో ప్రాథమికాంశాలు క్లుప్తంగా ఉంటాయి. ఇది వ్యాసాన్ని పరిచయం చేస్తుంది, మరింత చదవడానికి ఆసక్తిని పెంచుతుంది. అయితే, పాఠకుడికి అది ఓ టీజరు లాంటిదో, వ్యాసంలో ఏయే అంశాలు ఉండబోతున్నాయో చెప్పే సూచికో కాదు. ప్రవేశికను తటస్థ దృక్కోణంతో, స్పష్టంగా, సులభ శైలిలో రాయాలి.

ప్రవేశిక వ్యాసవిషయాన్ని సంక్షిప్తంగా వివరిస్తూ, స్వంతంత్రంగా నిలబడాలి. అంశాన్ని గుర్తించడం, సందర్భాన్ని స్థాపించడం, విషయం ఎందుకు ముఖ్యమైనదో వివరించడం, ప్రముఖ వివాదాలేమైనా ఉంటే వాటితో సహా అతి ముఖ్యమైన అంశాల సారాంశాన్ని ప్రవేశికలో వివరించాలి.[C] సాధారణంగా మొదటి కొన్ని వాక్యాల లోనే వ్యాస విషయపు ప్రాముఖ్యత స్థాపించబడుతుంది. విశ్వసనీయమైన, ప్రచురించబడిన మూలాల ప్రకారం, వ్యాసపు ప్రధాన భాగంలో వలె, ప్రవేశికలోని విషయానికి ఇచ్చిన ప్రాధాన్యత అంశానికి దాని ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. ప్రాథమిక వాస్తవాలు కాకుండా, ముఖ్యమైన సమాచారం వ్యాసం లోని మిగిలిన భాగంలో చేయనట్లైతే అది ప్రవేశికలో కూడా రాయకూడదు.

ప్రవేశికలో సముచితమైన చోట్ల మూలాలనివ్వవచ్చు. అయితే మూలాలు ప్రవేశికలో కాకుండా ప్రధానాంగంలో ఇవ్వడం సర్వసాధారణం.

అంశాలు, వరుస క్రమం

[మార్చు]

ప్రవేశికలో ఈ క్రింది క్రమంలో ఐచ్ఛిక అంశాలు ఉండవచ్చు: క్లుప్త వివరణ, అయోమయం లింకులు (డాబ్‌లింకులు/హ్యాట్‌నోట్‌లు), నిర్వహణ ట్యాగ్‌లు, సమాచారపెట్టెలు, ప్రత్యేక క్యారెక్టర్ల హెచ్చరిక పెట్టె, చిత్రాలు, నావిగేషనల్ బాక్స్‌లు (నావిగేషనల్ టెంప్లేట్‌లు), పరిచయ వచనం, విషయ సూచిక (పాత స్కిన్‌లలో ), మొదటి విభాగం యొక్క శీర్షికకు వెళ్లడం.

ప్రవేశిక ఆకృతి:

{{Short description}}
{{Hatnote}}

{{Article for deletion}}
{{Copy edit}}

{{Infobox rocket|name=...}}

{{Contains special characters}}

[[File:TypicalRocket.gif|...|A typical rocket]]
{{Rocket navigation sidebar}}

'''రాకెట్''' అంటే ...
==తొలి విభాగం==
  • క్లుప్త వివరణ అనేది పేజీ శీర్షికను వివరించడానికి ఉద్దేశించిన సంక్షిప్త పదబంధం. మరిన్ని వివరాల కోసం వికీపీడియా:సంక్షిప్త వివరణ చూడండి.
  • నిర్వహణ మూసలు, సమాచారపెట్టె, బొమ్మల కంటే ముందు, పేజీలో కనిపించాల్సిన మొదటి అంశం అయోమయ నివృత్తి లింకులు; పాఠకులు, తాము తప్పు పేజీకి వచ్చామని దీనిద్వారా వెంటనే తెలుసుకోవచ్చు. టెక్స్ట్-బ్రౌజర్‌లు, స్క్రీన్ రీడర్‌లు పేజీని ఒక వరుసలో చూపిస్తాయి. సుమారుగా ఇదే పేరుతో ఉన్న మరొక వ్యాసానికి లింకు చేయడానికి "ఒకే పేరుతో ఉన్న అంశాల కోసం ..." అనే అయోమయ నివృత్తి లింకును కొన్నిసార్లు వ్యాసం ప్రారంభంలో ఉంచుతారు. అలాంటి సందర్భాలలో, ఆ లైన్‌ను వాలుగా చేసి, హాట్‌నోట్ టెంప్లేట్‌లను ఉపయోగించి ఇండెంట్ చేయాలి. ఈ ప్రారంభ లింకును ఒక విభాగంగా చేయవద్దు.
  • తొలగింపు ట్యాగ్‌లు ( త్వరిత తొలగింపు, ప్రతిపాదిత తొలగింపు, తొలగింపు కొరకు వ్యాసాలు).
  • నిర్వహణ ట్యాగ్‌లు అయోమయ నివృత్తి లింకుల క్రింద ఉండాలి. ఈ ట్యాగ్‌లు వ్యాసపు నాణ్యత గురించి పాఠకులకు తెలియజేస్తాయి. వ్యాసం ప్రారంభానికి ముందే ఇది పాఠకులకు కనిపించాలి.
  • సమాచారపెట్టెల్లో వ్యాస విషయానికి సంబంధించిన సారాంశ సమాచారం లేదా అవలోకనం ఉంటుంది. అందువల్ల వాటిని పాఠ్యానికి ముందు ఉంచాలి (అవి సాధారణంగా ప్రవేశికలో పాఠ్యానికి కుడివైపున ఉంటాయి). సమాచారపెట్టె, నేవిగేషను పెట్టెల మధ్య ప్రాథమిక వ్యత్యాసం పారామితుల ఉనికి: నేవిగేషను పెట్టె, ఒకే అంశానికి చెందిన వ్యాసాలన్నిటిలో సరిగ్గా ఒకే విధంగా ఉంటుంది. సమాచారపెట్టెలో మాత్రం ఒక్కో వ్యాసంలో ఒక్కో కంటెంటు ఉంటుంది.
  • {{ Contains special characters}} అనే మూస, ఆ వ్యాసంలో ప్రత్యేక అక్షరాలు ఉన్నాయనీ, వాటికి వారి ప్లాట్‌ఫామ్ మద్దతు ఇవ్వకపోవచ్చుననీ పాఠకులను ఇది హెచ్చరిస్తుంది. ఈ మూసను ఆ ప్రత్యేక క్యారెక్టర్లకు సాధ్యమైనంత దగ్గరగా, పేజీని స్క్రాలు చెయ్యకుండానే కనబడేంత దగ్గరగా, ఉంచాలి. ఇది సాధారణంగా చిన్న సమాచార పెట్టెలకు తర్వాత, పొడవైన వాటికి ముందూ ఉంటుంది.
  • బొమ్మలు అన్ని బొమ్మల లాగానే, ప్రవేశికలో ఉపయోగించిన బొమ్మ కూడా వ్యాసాంశానికి సంబంధితంగా, సాంకేతికంగా నాణ్యంగా ఉండాలి. ప్రవేశిక లోని బొమ్మ వ్యాసాంశానికి దృశ్య రూపాన్ని ఇస్తుంది. తాము సరైన పేజీకి వచ్చామో లేదోనని పాఠకులు త్వరగా అంచనా వేయడానికి వీలు కల్పిస్తుంది. చిత్ర శీర్షికలు వ్యాసం వచనంలో భాగం. వ్యాసంలో అ.ని. లింకులు ఉంటే, పరిచయ చిత్రం పరిచయ వచనానికి ముందు కనిపించాలి.
  • సైడ్‌బార్లు అనేవి పరస్పరం సంబంధం ఉన్న అనేక వ్యాసాలలో ఉపయోగించే లింకుల సమగ్ర సేకరణ.. ఇది ఆ వ్యాసాల మధ్య నావిగేషన్‌ను సులభతరం చేస్తుంది.
  • మరీ చిన్నపాటి మొలకలైతే తప్ప, వ్యాసాలన్నీ పరిచయ వాక్యంతో మొదలవ్వాలి. ఈ వాక్యం, వ్యాసవస్తువు విశిష్టతను, వివాదాలేమైనా ఉంటే వాటితో సహా, వివరిస్తుంది. మరింత తెలుసుకోవడానికి పాఠకులలో ఆస్క్తిని రేకెత్తిస్తుంది. ప్రవేశికకు శీర్షిక ఉండదు.
  • పాత రూపుల్లో (ఉదాహరణ), నాలుగు విభాగాలున్న ప్రతివ్యాసంలోను విషయసూచిక ఆటోమాటిగ్గా కనిపిస్తుంది. విషయసూచికను ఫ్లోటింగుగా ఉంచవద్దు. ఫ్లోటింగు చెయ్యడం తప్పనిసరైతే, దాన్ని ప్రవేశిక తరువాత ఉంచండి.

ఉల్లేఖనలు

[మార్చు]

ప్రవేశిక, నిర్థారత్వం, జీవించి ఉన్న వ్యక్తుల జీవిత చరిత్రలు తదితర వికీ విధానాలకు అనుగుణంగా ఉండాలి. నిర్థారత్వ విధానం ప్రకారం, వ్యాఖ్యలకూ, నిర్థారణ చేసుకోవాల్సిన అవసరం ఉండే అవకాశం ఉన్న కంటెంటుకూ ఇన్‌లైన్ ఉల్లేఖనలు ఇవ్వాలి

సాధారణంగా ప్రధానాంగంలో ఉన్న సమాచారాన్నే ప్రవేశికలో పునరావృతం చేస్తాం కాబట్టి, ఎడిటర్లు ప్రవేశికలో అనవసరమైన ఉల్లేఖనలను నివారించాలని భావిస్తారు. అయితే అవసరమైన చోట్ల మూలాలను చేర్చి పాఠకులకు సహాయం చేయాల్సిన అవసరాన్ని కూడా గుర్తించి ఈ రెంటినీ సమతుల్యం చేసుకోవాలి. ప్రవేశికలో ఉల్లేఖనల ఉనికి ప్రతి వ్యాసంలోనూ ఉండాల్సిన అవసరం లేదు, అలాగని ఏ వ్యాసంలోనూ నిషేధించనూ లేదు. ప్రవేశికలో ప్రత్యేకంగా మూలాలు చేర్చడంలో మినహాయింపులేమీ లేవు. ప్రవేశికలో ఉల్లేఖనల అవసరాన్ని ఏకాభిప్రాయం ద్వారా ఒక్కో కేసును బట్టి నిర్ణయించుకోవాలి. సంక్లిష్టమైన, వర్తమాన, వివాదాస్పద విషయాలకు చాలా ఉల్లేఖనలు అవసరం కావచ్చు; కొన్నిటికి తక్కువ అవసరం పడవచ్చు, మరి కొన్నిటికి అసలు అవసరమే ఉండక పోవచ్చు.

ఈ మార్గదర్శకం గురించి ఎడిటర్లందరికీ తెలియకపోవచ్చు కాబట్టి, {{citation needed}} మూసలను ప్రవేశికలో చేర్చే అవకాశం ఉంది. అలాంటివి గమనించినపుడు దాన్ని సద్భావనతో అర్థం చేసుకోవాలి. ఈ {{citation needed}} మూసలను పెడతారు అని భావించిన వ్యాసాల్లో, దాన్ని నివారించేందుకు {{Leadcite comment}} అనే మూసను పెట్టవచ్చు.

కంటెంటు

[మార్చు]

ప్రవేశిక ఒక సరళమైన అవలోకనంగా ఉండాలి

[మార్చు]

వ్యాసంలో కవర్ చేసిన అతి ముఖ్యమైన అంశాలను ప్రవేశికలో సంగ్రహంగా రాయాలి. తద్వారా అది వ్యాసపు సంక్షిప్త రూపంగా దానికదే స్వతంత్రంగా నిలబడగలదు. వ్యాసాంశానికి ఉన్న విషయ ప్రాముఖ్యతను ప్రవేశికలో స్థాపించాలి లేదా కనీసం పరిచయమైనా చేయాలి (కానీ, "ప్రశంసలు పొందిన" లేదా "అవార్డు గెలుచుకున్న" లేదా "హిట్" వంటి ఆత్మాశ్రయపదాలను ఉపయోగించడం ద్వారా కాదు). వ్యాసంలోని మిగిలిన భాగంలో కంటే ఇక్కడి పాఠ్యం సరళంగా ఉండటం చాలా ముఖ్యం. మరీ పొడవైన పేరాలు, అతి వివరణలను నివారించాలి. ఆ వివరాలను వ్యాసపు ప్రధానాంగంలో రాయాలి. ప్రవేశిక లోని అంశాలను ప్రధానాంగంలో విస్తరిస్తూ రాస్తాం. ప్రవేశిక, ప్రధానాంగం లోని కంటెంటునే సంగ్రహిస్తుంది కాబట్టి, ప్రధానాంగంలో పాఠ్యం పునరుక్తమైనట్లు అనిపిస్తుంది. ప్రవేశిక వ్యాసంపై ఆసక్తి కలిగించేలా ఉండాలి గానీ, వాస్తవాలను వివరించకుండా ఆశ్చర్యం కలిగించేలా రాయకూడదు.

ప్రవేశికను వీలైనంత విస్తృతంగా పాఠకులకు అర్థమయ్యేలా సరళంగా రాయాలి. సాధ్యమైన చోట, అర్థం చేసుకోవడానికి కష్టమైన పరిభాష, చిహ్నాలు, గణిత సమీకరణాలు, సూత్రాలను నివారించాలి. అసాధారణ పదాలు అవసరమైన చోట, వాటిని తగిన సందర్భంలో ఉంచాలి, వాటికి సంబంధిత లింకులు ఇవ్వాలి, క్లుప్తంగా నిర్వచించాలి. అవసరమైతే ఒక గమనిక రాయాలి. విషయాన్ని సాధారణ పాఠకుడికి కూడా సుపరిచితమైన సందర్భంలో ఉంచాలి. ఉదాహరణకు, ఒక గ్రామం స్థానాన్ని సూచించడానికి "కావూరు గ్రామం ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలంలో ఉంది" అంటే సాధారణ పాఠకులకు కూడా తేలిగ్గా అర్థమౌతుంది. అలా కాకుండా, "కావూరు గ్రామం, 16°2′25.9″N 80°39′26.6″E నిర్దేశాంకాల వద్ద ఉంది." అంటే అర్థం కాదు. పాఠకులను నేరుగా మొదటి పదం నుండే వ్యాసవిషయం మధ్యలోకి పడెయ్యకూడదు; నిదానంగా దానిలోకి తీసుకెళ్ళాలి.

సాపేక్ష ప్రాముఖ్యత

[మార్చు]

సముచిత ప్రాధాన్యత విధానం ప్రకారం, వ్యాసాంశానికి సంబంధించి ముఖ్యమైన విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది ప్రవేశిక, ప్రధానాంగం రెండింటికీ వర్తిస్తుంది. రెండింటి మధ్య ప్రాధాన్యతల్లో తేడా ఉంటే, సంపాదకులు వ్యత్యాసాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించాలి.

ప్రవేశికలో ఉన్న ప్రతీ చిన్న సమాచారం ప్రధానాంగంలో ఉండి తీరాలన్న నిబంధనేమీ లేదు గానీ, ప్రధానాంగంలో ఎక్కడా రాయని ముఖ్యమైన సమాచారం ప్రవేశికలో ఉండకూడదు. వ్యాఖ్యానాలు, ఉదాహరణలు, పుట్టిన తేదీలు, వర్గీకరణ పేర్లు, టైపోలాజికల్ వర్గీకరణలు, కేసు సంఖ్యలు, శీర్షికలు వంటి నిర్దిష్ట వాస్తవాలు దీనికి మినహాయించవచ్చు

తొలి పేరా

[మార్చు]

మొదటి పేరాలో వ్యాసాంశాన్ని తటస్థ దృక్కోణంతో నిర్వచించాలి. కానీ ఆ నిర్వచనం మరీ నిర్దుష్టంగా, మరీ వివరంగా ఉండకూడదు. దాని చుట్టూ ఉన్న పరిస్థితులు లేదా వాస్తవాలను ఇస్తూ సందర్భాన్ని స్థాపించాలి. సముచితమైతే, దాని స్థానాన్నీ, సమయాన్నీ ఇవ్వాలి. ఇది అంశపు సరిహద్దులను కూడా నిర్వచించాలి; ఉదాహరణకు, దేశాల జాబితా – ద్వీప దేశాలు అనే వ్యాసం లోని ప్రవేశిక, క్లుప్తంగా ద్వీపదేశాల జాబితాను చూడవచ్చని చెబుతూ, ద్వీపదేశం అంటే నిర్వచనాన్ని చూపిస్తుంది.

తొలి వాక్యం

[మార్చు]

మొదటి వాక్యంలో విషయాన్ని పరిచయం చేయాలి. నిపుణులు కాని పాఠకులకు ఆ విషయం ఏమిటో, ఎవరో, ఎప్పుడో, ఎక్కడో తెలియజేయాలి. ఇది సరళమైన భాషలో ఉండాలి.

వ్యాస విషయం నిర్వచించదగినదైతే, మొదటి వాక్యంలో క్లుప్తంగా నిర్వచనం ఇవ్వాలి: వీలైనంత వరకూ సాధారణ పాఠకులకు అర్థమయ్యేలా రాయాలి. అలాగే, వ్యాసం పేరు ప్రత్యేకమైన పరిభాషకు చెందినదైతే, దాని సందర్భాన్ని వీలైనంత త్వరగా వివరించాలి.[D]

ఒకే ఒక్క కారణం వల్లనే విషయ ప్రాముఖ్యత పొందిన వ్యాసాలలో, ఆ కారణాన్ని మొదటి వాక్యంలో ఇవ్వాలి.[E]

విషయానికి సంబంధించిన ప్రతీ ముఖ్యమైన విషయాన్నీ వివరిస్తూ బోలెడంత సమాచారాన్ని మొదటి వాక్యంలో కూరకూడదు. ఆ సమాచారాన్ని మొత్తం ప్రవేశిక అంతటా విస్తరిస్తూ రాయాలి. ప్రత్యామ్నాయ స్పెల్లింగులు, ప్రత్యామ్నాయ పదాలు, ఉచ్చారణలు, ఇంగ్లీషు అర్థాలు వంటి అంశాలతో కూడిన బ్రాకెట్లతో మొదటి వాక్యాన్ని నింపరాదు: ఇవి వాక్యాన్ని చదవడానికి ఇబ్బంది కలిగిస్తాయి. గందరగోళాన్ని నివారించడానికి, వీటిని రెండవ లేదా మూడవ వాక్యంలో చెప్పవచ్చు. సమాచారపెట్టె లోని |pronunciation= లేదా |native_name= పరామితులలో గానీ, వివరణాత్మక ఫుట్‌నోట్ల వంటి వేరే చోట గానీ ఉంచాలి.

1967 సెప్టెంబరు 11–14 మధ్య నాథూ లా కనుమ కోసం; 1967 అక్టోబరు 1 న చో లా కనుమ కోసం భారత చైనాల మధ్య జరిగిన సైనిక ఘర్షణలే నాథూ లా, చో లా ఘర్షణలు. ... (నాథూ లా, చో లా ఘర్షణలు)

తేదీల వివరాలను మొదటి వాక్యం నుండి తీసేసి ప్రవేశికలో వేరే చోట్ల చేర్చుతూ దీన్ని ఇలా రాయవచ్చు:

1967 సెప్టెంబరు, అక్టోబరుల్లో నాథూ లా, చో లా కనుమల కోసం భారత చైనాల మధ్య జరిగిన సైనిక ఘర్షణలే నాథూ లా, చో లా ఘర్షణలు. ... (నాథూ లా, చో లా ఘర్షణలు)

వ్యాసం పేరును సబ్జెక్టుగా వాడడం

[మార్చు]

వీలైతే, వ్యాసం పేరునే మొదటి వాక్యానికి సబ్జెక్టుగా వాడాలి.[F] ఈ సందర్భంలో పేరులో ఇతర రూపాలు ఏమైనా ఉంటే వాటిని కూడా చూపించవచ్చు.[G] పేజీ పేరును కొద్దిగా భిన్న రూపంలో చూపించవచ్చును కూడా.[H] వ్యాస శీర్షికలో అయోమయ నివృత్తి కోసం బ్రాకెట్లలో పెట్టే భాగాన్ని మొదటి వాక్యంలో రాయకూడదు.[I]

వ్యాసం పేరు, ఆ సబ్జెక్టుకు సంబంధించి విస్తృతంగా వాడుకలో ఉన్న పదమైతే, మొదటి వాక్యంలో దాన్ని వీలైనంత ముందుగా ప్రస్తావించాలి:

ఎలక్ట్రాన్ అనేది పరమాణువులోని ఒక మౌలిక కణం. (ఎలక్ట్రాన్)

అయితే, పేజీ పేరును మొదటి వాక్యంలో సబ్జెక్టుగా వాడకూడని సందర్భాలు కూడా ఉన్నాయి.§ Alternative biographical names and § Other types of articles చూడండి. అలాగే, వ్యాసం పేరు వివరణాత్మకమైనది అయినప్పుడు కూడా పేజీ పేరును మొదటి వాక్యంలో వాడకూడదు. ఉదాహరణకు బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశం నుండి నిష్క్రమించే నాటికి స్వదేశ సంస్థానాధీశుల నిర్ణయాలు అనే వ్యాసపు మొదటి వాక్యంలో పేజీ పేరు రాయనక్కరలేదు.

ఏది ఏమైనప్పటికీ, పేజీపేరు సహజంగా మొదటి వాక్యంలో ఒదిగిపోయే లాగా ఉంటే, అలానే రాయాలి.

అనవసరమైన వాటిని నివారించండి
[మార్చు]

మొదటి వాక్యంలో పునరావృతాలను వీలైనంత తగ్గించండి. వ్యాసం పేరులో లేని సమాచారాన్ని అందించడానికి వ్యాసపు మొదటి వాక్యాన్ని ఉపయోగించాలి. వ్యాసం పేరు వివరణాత్మకంగా ఉంటే, అది ప్రవేశికలో యథాతథంగా కనిపించాల్సిన అవసరం లేదు.

ఉదాహరణకు:

Bad: ఫిజి-భారత్ సంబంధాలు ఫిజి & భారతదేశం మధ్య విదేశీ సంబంధాలను సూచిస్తాయి.
Good: భారతదేశం, ఫిజీ లు 2005 లో దౌత్యసంబంధాలు నెలకొల్పుకున్నాయి.

మొదటి వాక్యం పునరుక్తితో కృతకంగా ఉండగా, రెండవది మరింత సమాచారాన్ని ఇస్తూ, సహజంగా ఉంది.

మొదటి వాక్యంలో వ్యాసం శీర్షిక సులభంగా, సహజంగా ఒదిగక పోతే, దానిని చేర్చే ప్రయత్నంలో వాక్యాన్ని, పదాలనూ వంకర్లు తిప్పకూడదు. అనవసరమైన పునరుక్తిని నివారించి, విషయాన్ని సరళమైన భాషలో వివరించాలి.

Bad:2022 భారత-పాక్ క్షిపణి ఘటన అనేది, 2022 మార్చి 9 న భారతదేశం, హర్యానాలోని అంబాలా నుండి అనుకోకుండా పాకిస్తాన్ పైకి బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించిన ఘటన.
Good: 2022 మార్చి 9 న భారతదేశం, హర్యానాలోని అంబాలా నుండి అనుకోకుండా బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించగా, అది పాకిస్తాన్‌ లోని పంజాబ్‌ రాష్ట్రం, ఖానేవాల్ జిల్లా లోని మియాన్ ఛన్నూ పైకి దూసుకెళ్లింది.

కొన్నిసార్లు కొద్దిపాటి పునరావృత్తి అనివార్యం. ఉదాహరణకు, శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు ను, నిఘంటువు అనే పిలవాలి. మొదటి వాక్యంలో దానిని, నిఘంటువు అని తప్ప మరే విధంగానూ ప్రస్తావించడానికి కుదరదు. ఈ సందర్భాలలో కూడా, శీర్షికలో లేని సమాచారాన్ని మొదటి వాక్యంలో ఇవ్వాలి. కానీ వీలైనప్పుడల్లా పదాల పునరుక్తి లేకుండా చెప్పడానికి ప్రయత్నించాలి.

Bad: శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు ఒక తెలుగు నిఘంటువు.

దాని బదులు ఇలా రాయవచ్చు:

Good: శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు ఎనిమిది సంపుటాలలో, లక్షా పదివేల మాటలతో కూర్చిన తెలుగు నిఘంటువు.

రెండింటిలోనూ కొంత పునరుక్తి ఉంది, కానీ రెండవది మెరుగైనది, ఎందుకంటే అది మరిన్ని వివరాలను ఇస్తోంది.

తొలి వాక్యం ఆకృతి

[మార్చు]

మొదటి వాక్యంలో వ్యాసం పేరు యథాతథంగా వచ్చినపుడు, దాన్ని బొద్దు చెయ్యాలి. వ్యాసం పేరు ఉన్నదున్నట్లుగా రాకపోతే, దాన్ని బొద్దు చెయ్యరు.

శీర్షికను, ఇతర పేర్లనూ బొద్దు చేయడం
[మార్చు]

మొదటిసారి ప్రస్తావించిన చోట శీర్షిక పేరునూ, ముఖ్యమైన ప్రత్యామ్నాయ పేర్లనూ మాత్రమే బొద్దు చెయ్యాలి. ఈ ప్రత్యామ్నాయ పేరు సాధారణంగా దారిమార్పు అయి ఉంటుంది.

ముంబై, భారత రాష్ట్రమైన మహారాష్ట్రకు రాజధాని. దీనికి గతంలో బొంబాయి అనే పేరు ఉండేది. (ముంబై)

ఈ సందర్భంలో, సాధారణ సంక్షిప్త రూపాలు (సంబంధిత శీర్షిక తర్వాత కుండలీకరణాలలో ఉన్నవి) ముఖ్యమైన ప్రత్యామ్నాయ పేర్లుగా పరిగణించబడతాయి:

ఐక్యరాజ్య సమితి (ఐరాస) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ.

ఒకవేళ ప్రధాన కథనం, ప్రత్యేక వ్యాసం లేని అంశానికి సంబంధించిన ఒక సంఘటన గురించి అయితే, ప్రత్యేకించి ఈ పేజీ ఒక ఒక రీడైరెక్ట్‌కు లక్ష్యంగా ఉన్నప్పుడు, ఆ సబ్జెక్టును బొద్దు చెయ్యాలి:

గూళపాళెం కురుబ హంపన్న బ్రిటిషు పాలనా కాలంలో నేటి ఆంధ్రప్రదేశ్ లోని గుంతకల్లు గ్రామం వద్ద రైలు గేటు కాపలాదారుగా ఉండేవాడు. 1893లో ఆంగ్లేయ సైనికుల బలాత్కార ప్రయత్నం నుంచి ఇద్దరు భారతీయ స్త్రీలను కాపాడి, ఆ ప్రయత్నంలో ప్రాణం కోల్పోయాడు.)

సాధారణంగా తెలుగులో ఉపయోగించని తెలుగేతర పేర్లను బొద్దు చేయవద్దు.(See § Other languages.)

మిలన్ (Italian: మిలానో), ఉత్తర ఇటలీ లోని నగరం.

ప్రధాన పేజీలో ప్రత్యామ్నాయ పేర్లను బోల్డ్‌గా చేయవద్దు.

కింది సాధారణ తప్పులను నివారించండి
[మార్చు]

ప్రవేశిక లోని మొదటి వాక్యంలో శీర్షికను బొద్దు చెయ్యడం కోసం, దానికి లింకులు ఇవ్వకూడదు:[J]

Bad: భండారు అచ్చమాంబ (1874 - 1905) తొలి తెలుగు కథా రచయిత్రి.
Good: భండారు అచ్చమాంబ (1874 - 1905) తొలి తెలుగు కథా రచయిత్రి.

దీనికి ఒక మినహాయింపు: ప్రాథమిక అంశానికి లింకు ఉన్నట్లయితే, స్పష్టీకరణ పేజీలు ఆ లింకు కోసం బోల్డ్‌ను ఉపయోగించవచ్చు.

సాధారణంగా, మొదటి వాక్యంలో వ్యాస శీర్షిక (లేదా ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయ శీర్షిక) లేనట్లైతే, అక్కడ ఉన్న సంబంధిత పాఠ్యానికి బొద్దు శైలిని వర్తింపజేయవద్దు (2008 లో పశ్చిమ భారతదేశంలో జరిగిన బాంబు దాడులు పేజీ నుండి ఉదాహరణ):

Bad: 2008 సెప్టెంబరు 29న పశ్చిమ భారతదేశం లోని గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మూడు బాంబులు పేలాయి. ఇందులో ఆరుగురు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు.
Good: 2008 సెప్టెంబరు 29న పశ్చిమ భారతదేశం లోని గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మూడు బాంబులు పేలాయి. ఇందులో ఆరుగురు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు.
సంజ్ఞావాచకాలు (పేర్లు), బిరుదులు
[మార్చు]

ఒకవేళ పేజీ శీర్షిక సాధారణంగా ఇటాలిక్స్‌లో ఉంటే (ఉదాహరణకు, సినిమా, పుస్తకం వగైరా), అప్పుడు ప్రవేశికలో దాని మొదటి ప్రస్తావన బొద్దు, వాలు రెండింటిలోనూ ఉండాలి:

అతడు అడవిని జయించాడు, డా. కేశవరెడ్డి రాసిన నవలిక. ...
ఆ నలుగురు అనేది 2004 లో వచ్చిన తెలుగు సినిమా. ...

వ్యాసం పేరును కొటేషన్ మార్కుల మధ్య ఉంచినట్లైతే, పేరును మాత్రమే బొద్దు చెయ్యాలి, కొటేషన్ మార్కులను చెయ్యకూడదు:

"తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి" అనేది, గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాటకం లోని డైలాగు.
ఉచ్చారణ
[మార్చు]

తెలుగులో, ఎలా పలుకుతామో అలాగే రాస్తాం కాబట్టి ఉచ్చారణ రాయాల్సిన అవసరం సాధారణంగా ఉండదు. అయితే కొన్ని పరభాషా పదాలను పలకడానికీ రాయడానికీ తేడా ఉంటుంది. అలాంటి సందర్భంలో బ్రాకెట్లో దాని స్పెల్లింగును రాయవచ్చు. ఈ స్పెల్లింగు వీలైనంత వరకు తెలుగులోనే ఉండాలి. ఉదాహరణకు దూ అనే ఫ్రెంచి పదానికి వ్యాసం రాసేటపుడు "దూ (డ్యూక్స్)" అని రాయవచ్చు. "దూ (Deaux)" అని రాయడాన్ని సాధ్యమైనంతవరకు నివారించాలి.

కొన్ని ఇంగ్లీషు వ్యాసాల్లో ఉండే ఉచ్చారణ సంజ్ఞలను తెలుగు అనువాదంలో రాయరాదు.

సందర్భోచిత లింకులు
[మార్చు]

మొదటి వాక్యం, వ్యాసాంశానికి ముఖ్యమైన విస్తృతమైన లేదా ప్రాథమిక విషయాలకు లింకులను ఇవ్వాలి. లేదా దానికి గుర్తింపును పేర్కొనాలి. ఉదాహరణకు, ఒక భవనం లేదా ప్రదేశం గురించిన వ్యాసంలో, దానికి సంబంధించిన భౌగోళిక ప్రాంతాల్లో అత్యంత స్థూల ప్రాంతానికి లింకు ఇవ్వాలి.

హార్ముజ్ జలసంధి, పర్షియన్ సింధుశాఖకు, ఒమన్ సింధుశాఖకూ మధ్య ఉన్న సన్నపాటి జలసంధి.

ఒక సాంకేతిక లేదా పరిభాషా పదం గురించిన వ్యాసంలో, మొదటి వాక్యం లేదా పేరాగ్రాఫ్‌లో సాధారణంగా ఆ పదం వచ్చిన అధ్యయన రంగానికి సంబంధించిన లింకు ఉండాలి.

ఖగోళ భౌతికశాస్త్రంలో, ఎక్రీషన్ అంటే పదార్థ కణాలు ఒకదానితో ఒకటి చేరి, గురుత్వాకర్షణతో మరిన్ని కణాలను చేర్చుకుంటూ పెద్ద వస్తువుగా తయారయ్యే ప్రక్రియ.

వ్యక్తి గురించిన వ్యాసంలోని మొదటి వాక్యం, ఆ వ్యక్తి ప్రాముఖ్యత సాధించిన అంశానికి సంబంధించిన పేజీ లేదా పేజీలకు లింకు చేయాలి.

వేమూరి వేంకటేశ్వరరావు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేశాడు.

భవనాలు, వేదికలు, స్మారక చిహ్నాలు, ఇతర భౌతిక నిర్మాణాల గురించిన వ్యాసాల విషయంలో, వాటి స్థానాన్ని పరిచయంలోని మొదటి వాక్యంలో పేర్కొనాలి. సాధారణంగా దీని అర్థం నగరం, పరిపాలనా ప్రాంతం (అవసరమైతే), దేశాన్ని పేర్కొనడం:

చార్మినార్ (నాలుగు మినార్లు) భారతదేశంలోని హైదరాబాదు పాతబస్తిలో ఉన్న స్మారక చిహ్నం, మసీదు. ఇది నాలుగు మీనార్లు కలిగిన ఒక చారిత్రక కట్టడము.

వ్యాస విషయాన్ని అర్థం చేసుకోడానికి ఏది సరిగ్గా సరిపోతుంది అనేది ఒక్కో వ్యాసానికి ఒక్కో రకంగా ఉంటుంది.

చంద్రశేఖర్ పరిమితి అనేది, స్థిరత్వంలో ఉన్న తెల్ల మరుగుజ్జు నక్షత్రానికి ఉండదగ్గ గరిష్ఠ ద్రవ్యరాశి.

వ్యాస విషయానికి అంతగా సంబంధించనివి, విషయ ప్రాముఖ్యతను వివరించేందుకు దోహదపడనివీ అయిన లింకులను చేర్చరాదు. ఉదాహరణకు, గాంధీ కొండ వ్యాసంలో విజయవాడ నగరం నడిబొడ్డున, ఉంది అనే వాక్యంలో నడిబొడ్డున అనే పదానికి లింకు ఇవ్వరాదు. విజయవాడ నగరంలో ఉంది అనేది ముఖ్యం గానీ, నడిబొడ్డున ఉంది అనేదానికి ప్రాముఖ్యత తక్కువ. దానికి లింకు ఇవ్వడం అనుచితం.

ఇంగ్లీషు వికీపీడియాలోని విశేష వ్యాసాల ప్రవేశికల్లో 12 నుండి 25 దాకా లింకులు ఉంటాయి. సగటున ప్రతి రెండు వాక్యాలకు మూడు లింకులు ఉంటాయి.

మొదటి వాక్యంలో, బొద్దు చేసిన వ్యాస శీర్షికకు ముందు సాధ్యమైనంత వరకు లింకులివ్వరాదు. అయితే ఇలా లింకు ఇవ్వడం నివారించేందుకు వాక్యాన్ని కృతకంగా మార్చనక్కరలేదు, తప్పనిసరైతే లింకు ఇవ్వవచ్చు.

ఖగోళ భౌతికశాస్త్రంలో, ఎక్రీషన్ అంటే పదార్థ కణాలు ఒకదానితో ఒకటి చేరి, గురుత్వాకర్షణతో మరిన్ని కణాలను చేర్చుకుంటూ పెద్ద వస్తువుగా తయారయ్యే ప్రక్రియ.

పై వాక్యంలో ఖగోళ భౌతికశాస్త్రంకు లింకు ఇవ్వక తప్పని పరిస్థితి ఉంది. వాక్యాన్ని తిరగరాస్తే కృతకంగా ఉండే అవకాశం ఉంది.

జీవిత చరిత్రలు

[మార్చు]
  • విజ్ఞాన సర్వస్వ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్న వివాదాలకు సంబంధించి, విశ్వసనీయ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ప్రవేశికలో కనబడకుండా అణచివేయకూడదు. అలాగని అది మిగతా సమాచారాన్ని డామినేట్ చేసేలా ఉండకూడదు; ప్రవేశిక వ్యాసం మొత్తాన్నీ సముచితంగా సంగ్రహించాలి.
  • ఒక విషయాన్ని ప్రభావితం చేసే ఇటీవలి సంఘటనలు చారిత్రక దృక్కోణంలో ఉంచబడతాయి; అత్యంత ఇటీవలి సమాచారమే అత్యంత ముఖ్యమైనది కానవసరం లేదు. కొత్త సమాచారాన్ని పాత సమాచారంతో సమతుల్యం చేయాలి. అన్ని అంశాలకూ తగిన ప్రాధాన్యత ఇవ్వాలి.
  • వికీపీడియా సంస్మరణ స్థలం కాదు. ఒక వ్యక్తి మరణించినప్పుడు, ప్రవేశికలో పెద్దయెత్తున మార్పులు జరగకూడదు. లేదా ఆ మరణం గురించే పదేపదే ప్రస్తావించనూ కూడదు.
  • జీవించి ఉన్న వ్యక్తుల పుట్టిన తేదీలతో సహా వ్యక్తిగత వివరాల కోసం ప్రాథమిక మూలాలను ఉపయోగించవద్దు .

జీవిత చరిత్రల మొదటి వాక్యం

[మార్చు]

జీవిత చరిత్ర వ్యాసాల మొదటి వాక్యంలో కిందివి ఉండాలి:

  1. పేరు (లు), హోదా (లు), ఏవైనా ఉంటే అవి రాయాలి.
  2. పుట్టిన, మరణించిన తేదీలను, ద్వితీయ మూలాలలో కనబడితేనే వాడాలి. – జీవించి ఉన్న వ్యక్తుల పుట్టిన తేదీలు లేదా వారి గురించిన ఇతర వ్యక్తిగత వివరాల కోసం ప్రాథమిక మూలాలను ఉపయోగించవద్దు. వ్యాసంలో వేరే చోట జనన/మరణ తేదీలకు సంబంధించిన రోజు–నెల–సంవత్సరం వివరాలు ఇచ్చి ఉంటే, సందర్భాన్ని అందించడానికి కేవలం సంవత్సరాన్ని రాయవచ్చు.
  3. ఆ వ్యక్తి ప్రశస్తి పొందిన కార్యకలాపాలకు సంబంధించిన సందర్భం (ప్రదేశం, జాతీయత మొదలైనవి).
  4. వ్యక్తి నిర్వహించిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ముఖ్యమైన పదవులు, కార్యకలాపాలు లేదా పాత్రలు. వ్యక్తిగత అభిప్రాయానికి సంబంధించిన లేదా వివాదాస్పదమైన పదాలను నివారించాలి.
  5. వ్యక్తి ప్రసిద్ధి చెందడానికి గల ప్రధాన కారణం (ముఖ్యమైన విజయం, రికార్డు మొదలైనవి)

అయితే, విషయానికి సంబంధించిన ముఖ్యమైన ప్రతి విషయాన్ని వివరిస్తూ మొదటి వాక్యాన్ని సమాచారంతో నింపేయకుండా, దానికి బదులుగా సంబంధిత సమాచారాన్ని ప్రారంభ విభాగంలో విస్తరించండి. ఉదాహరణలు:

వాణిశ్రీ (జ.1948 ఆగష్టు 3, నెల్లూరు) 1960, 1970 దశకాలలో పేరొందిన తెలుగు సినిమా నటి.

విశ్వనాథ సత్యనారాయణ (1895 సెప్టెంబరు 10 - 1976 అక్టోబరు 18) 20వ శతాబ్దపు తెలుగు రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, "కవి సామ్రాట్" బిరుదాంకితుడు.

వసుంధర అనే కలం పేరుతో తెలుగులో రచనలు చేసిన జంట రచయితలు, జొన్నలగడ్డ రాజగోపాలరావు, రామలక్ష్మి దంపతులు.

సి.ఆర్.రావుగా పేరొందిన కల్యంపూడి రాధాకృష్ణారావు (1920 సెప్టెంబరు 10 - 2023 ఆగస్టు 22) గణిత శాస్త్రజ్ఞుడు, గణాంక శాస్త్రజ్ఞుడు.

వ్యక్తుల ఇతర పేర్లు

[మార్చు]
  • జీవితచరిత్ర వ్యాసానికి పేరుగా, ఆ వ్యక్తికి ప్రాచుర్యంలో ఉన్న పేరును ఉపయోగిస్తుండగా, ప్రవేశిక మొదటి వాక్యంలో ఆ వ్యక్తి పూర్తి పేరును, ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ వ్యాసంలో, ప్రధాన వాక్యం ఇలా ఉంటుంది: " అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్ (1931 అక్టోబరు 15 - 2015 జులై 27) భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. ...".
  • ఒక వ్యక్తి ఎప్పుడైనా తన పూర్తి పేరును మార్చుకుంటే, పుట్టినప్పుడు పెట్టిన పేరును కూడా ఇవ్వవచ్చు. ఒక మహిళ పెళ్ళయ్యాక పేరుతో ప్రసిద్ధి చెందక ముందు, పుట్టింటి పేరును కూడా చేర్చవచ్చు. అలాగే పేరు మార్చుకున్న వ్యక్తి గురించిన వ్యాసంలో వారి అసలు పేరును కూడా ఉదహరించవచ్చు. ఉదాహరణకు, నూతన్ ప్రసాద్ (1945 డిసెంబరు 12 - 2011 మార్చి 30) గా పేరు గాంచిన తాడినాడ వరప్రసాదరావు తెలుగు సినిమా రంగములో ప్రసిద్ధి చెందిన నటుడు, టివి వ్యాఖ్యాత.

పేర్ల కోసం ప్రత్యేక విభాగాన్ని వాడడం

[మార్చు]

మూడు లేదా అంతకంటే ఎక్కువ ప్రత్యామ్నాయ పేర్లు ఉంటే, వాటిని మొదటి వాక్యంలో చేర్చకూడదు. అలా చేస్తే గందరగోళంగా ఉంటుంది. దానికి బదులుగా, ఆ పేర్లను ఫుట్‌నోట్‌లో చేర్చవచ్చు, లేదా వ్యాసంలో "పేర్లు" లేదా "వ్యుత్పత్తి" వంటి విభాగాలలో వేరే చోటికి తరలించవచ్చు.

ఇతర భాషలు

[మార్చు]

వికీపీడియా పేర్ల సంప్రదాయం ప్రకారం వ్యాసాలకు తెలుగు పేర్లే పెట్టాలి. అయితే, కొన్ని పేర్ల (ఉదాహరణకు స్పేస్‌ షటిల్‌)కు తెలుగు అనువాదాలు ఉండక పోవచ్చు; వాటికి ఇంగ్లీషు పేరే వాడండి, కానీ తెలుగు లిపిలో ఉండాలి. ఇంగ్లీషు లిపిలో పేరు రాయకండి.

పొట్టి వ్యాసాలు

[మార్చు]

వ్యాసంలో విభాగాలేమీ లేకుండా, మొలక స్థాయిలో ఉంటే, ప్రవేసిక అవసరం ఉండదు. మొలకలను విస్తరించమని వికీపీడియా ప్రోత్సహిస్తున్నప్పటికీ, విశ్వసనీయమైన మూలాలు దొరకని సందర్భంలో విస్తరణ దాదాపు అసంభవంగా ఉంటుంది. వ్యాసాన్ని సుమారు నాలుగైదు వందల పదాల స్థాయికి విస్తరించాక, వ్యాసాన్ని మొలక వర్గం నుండి తీసేసి, ఇక దానిని విభాగాలుగా విభజించవచ్చు. సాధారణంగా ఒక చక్కటి ప్రవేశిక కంటే నిడివిలో చిన్నవైన వ్యాసాలకు ప్రవేశిక అవసరం ఉండదు.

నిడివి

[మార్చు]

ప్రవేశిక నిడివి ఎంత ఉండాలి అనేది, విషయపు సంక్లిష్టత పైనా, వ్యాసంలో జరిగిన అభివృద్ధి పైనా ఆధారపడి ఉంటుంది. నిడివి మరీ చిన్నదిగా ఉంటే పాఠకుడికి అసంతృప్తి కలుగుతుంది; మరీ పెద్దదిగా ఉంటే భయపెడుతుంది, చదవడానికి కష్టంగా ఉంటుంది. మధ్యలోనే పాఠకుడు ఆసక్తి కోల్పోయేలా చేయవచ్చు. ఈ సందర్భంలో కింది సూచనలు ఉపయోగకరంగా ఉండవచ్చు:

  • ఈ అంశంపై సంక్షిప్తమైన, కానీ ఉపయోగకరమైన, సంపూర్ణమైన సారాంశం ఉండాలనే పాఠకుల అంచనాలకు అనుగుణంగా దీని నిడివి ఉండాలి.
  • చక్కగా రాసిన ప్రవేశికలు సుమారు 100 పదాలకు లోపు ఉండడం అరుదు. ఎన్వికీ లోని విశేష వ్యాసాల్లో, ప్రవేశికలు సుమారు 250 నుండి 400 పదాల దాకా ఉంటాయి.

ప్రవేశికను సవరించడం

[మార్చు]

వ్యాసపు "సవరించు" లేదా "మూలపాఠ్యాన్ని సవరించు" ట్యాబుపై నొక్కి ప్రవేశికను సవరించవచ్చు. డిఫాల్ట్‌గా, ప్రవేశిక కు మార్చు లింకు ఉండదు. కానీ, నమోదైన వాడుకరులు తమ అభిరుచుల్లో కింది వాటిలో ఒకదాన్ని లేదా రెండింటినీ చేతనం చేసుకుని మార్పు లింకును పొందవచ్చు (ఈ రెండింటికీ జావాస్క్రిప్ట్ అవసరం):

  • Preferences → ప్రదర్శన → check ప్రవేశికలో [మార్చు] లింకు
  • Preferences → సాధారణ ఎంపికలు → check విభాగం పేరు మీద రైట్‌ క్లిక్కుతో విభాగం దిద్దుబాటు కావాలి

ప్రాధాన్యతలను మార్చాల్సిన అవసరం లేని, సందర్భానుసారంగా అనుసరించగల ఒక ప్రత్యామ్నాయం ఏమిటంటే, వ్యాసంలోని ఇతర విభాగాలలో ఏదో ఒకదానిలో "మూలపాఠ్యాన్ని సవరించు" లింకును నొక్కి, అపుడు వచ్చే url లో section= అనేచోట విలువను "section=0"గా మార్చి, ఎంటరు నొక్కడం. అపుడు, ఎడిటరులో ప్రవేశిక తెరుచుకుంటుంది.

వార్తాపత్రికల ప్రవేశిక శైలితో పోలిక

[మార్చు]

వికీపీడియా ప్రవేశికలను వార్తాపత్రికల శైలిలో రాయం. అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని మొదట ఉంచడం, కేవలం ముందుమాట చదివినా కూడా ఏ పాఠకుడైనా విషయాన్ని అర్థం చేసుకోగలిగేలా చేయడం వంటి కొన్ని సారూప్యతలు వీటికి ఉన్నప్పటికీ, కొన్ని తేడాలు కూడా ఉన్నాయి. వార్తాపత్రిక జర్నలిజంలోని ప్రవేశిక పేరాగ్రాఫ్[K] అనేది ఒక వార్తకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన వాస్తవాలను మాత్రమే సంక్షిప్తంగా సంగ్రహించిన సారాంశం. ఈ ప్రాథమిక వాస్తవాలను కొన్నిసార్లు ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు అనే "ఐదు Wలు" అని కూడా అంటారు. పత్రికల్లో ప్రవేశికలు సాధారణంగా ఒకటి లేదా రెండు వాక్యాల పొడవు మాత్రమే ఉంటాయి. దీనికి విరుద్ధంగా, వికీపీడియా వ్యాసాలలో మొదటి వాక్యం సాధారణంగా ఒక నిర్వచనంగా ఉంటుంది. ప్రవేశిక పొడవుగా ఉంటుంది. అంతిమంగా అది మరింత సమాచారాన్ని అందిస్తుంది, ఎందుకంటే దాని ఉద్దేశ్యం వ్యాసాన్ని కేవలం పరిచయం చేయడం కాదు, దాని సారాంశాన్ని తెలియజేయడం.

భోపాల్ విపత్తుకు సంబంధించి పత్రికల శైలికి, విజ్ఞాన సర్వస్వ శైలికీ ప్రవేశికలో పోలిక
పాత్రికేయ నాయకత్వం విజ్ఞాన సర్వస్వ నాయకత్వం
మధ్య భారతదేశంలో అమెరికా యాజమాన్యంలోని పురుగుమందు కర్మాగారం నుంచి విషవాయువు లీకవడంతో రాత్రికి రాత్రే కనీసం 410 మంది మరణించారని, మృతులలో చాలామంది నిద్రిస్తున్నప్పుడే చనిపోయారని అధికారులు ఈ రోజు తెలిపారు. భోపాల్ నగరంలో జరిగిన ఈ విపత్తులో కనీసం 12,000 మంది గాయపడగా, వారిలో 2,000 మంది ఆసుపత్రిలో చేరారు.

—హజారికా, సంజయ్ (1984 డిసెంబరు 3) "భోపాల్ నగరంలో గ్యాస్ లీక్ కారణంగా కనీసం 410 మంది మృతి" ది న్యూయార్క్ టైమ్స్
1984 డిసెంబర్ 3న, భారతదేశం, మధ్యప్రదేశ్ రాష్ట్రం, భోపాల్‌ లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ వారి పురుగుమందుల కర్మాగారం నుండి మిథైల్ ఐసో సయనేట్ అనే తీవ్ర విషపూరిత వాయువు లీకవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న 5,00,000 పైచిలుకు ప్రజలు విషప్రభావానికి గురయ్యారు. దీన్ని, ప్రపంచంలో కెల్లా అత్యంత దారుణమైన పారిశ్రామిక దుర్ఘటనగా భావిస్తారు. 2006 లో ప్రభుత్వం సమర్పించిన ఒక అఫిడవిట్‌లో, ఈ దుర్ఘటనలో 5,58,125 మంది గాయపడగా, అందులో 38,478 మంది తాత్కాలిక పాక్షిక గాయాలు కాగా, 3,900 మంది తీవ్రమైన, శాశ్వత వైకల్యం కలిగించే గాయాలకు లోనయ్యారు. మరణాల సంఖ్యలో పలు అంచనాలున్నాయి. అధికారిక అంచనాల ప్రకారం తక్షణ మరణాల సంఖ్య 2,259. ఇతర అంచనాల ప్రకారం, ఘటన జరిగిన రెండు వారాల్లోపు 8,000 మంది మరణించగా, మరో 8,000 మంది వాయువు సంబంధ రోగాల వలన మరణించారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన కోర్టు కేసును సెటిల్ చేసుకోవడంలో భాగంగా 1989 లో యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ 47 కోట్ల డాలర్లను చెల్లించింది.

శుభ్రపరచడం

[మార్చు]

ప్రవేశిక విభాగాల శుభ్రపరచడానికి సంబంధించిన టెంప్లేట్ సందేశాల జాబితా కోసం, Wikipedia:Template messages/Cleanup § Introduction చూడండి.Wikipedia:Template messages/Cleanup § Introduction . ఎడిటర్లు కేవలం ప్రవేశికలను ట్యాగ్ చేయడానికే కాకుండా, వాటిని మెరుగుపరచడానికి ప్రోత్సహించబడతారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

గమనికలు

[మార్చు]
  1. ↑ 2022 ఏప్రిల్ నాటికి wikipedia.org గురించి అలెక్సా ఇలా చెప్పింది: వికీపీడియా సందర్శకులు సగటున 4 నిమిషాల 6 సెకండ్ల పాటు సైట్లో గడిపారు.[1]
  2. ↑ meta:Research:Which parts of an article do readers read చూడండి.
  3. ↑ ప్రవేశికలో అంతగా ప్రాముఖ్యత లేని వివాదాంశాలకు అనవసరమైన ప్రాముఖ్యత నిచ్చి వికీపీడియా తటస్థ దృక్కోణాన్ని అతిక్రమించవద్దు.
  4. ↑ ఉదాహరణకు,
    ఒక వస్తువు ధరకు, ఆ ధర వద్ద ఆ వస్తువుకు ఉండే డిమాండునే డిమాండ్ రేఖ అని పిలుస్తారు.
    కు బదులు ఇలా రాయాలి:
    ఆర్థిక శాస్త్రంలో, ఒక వస్తువు ధరకూ, ఆ ధర వద్ద ఆ వస్తువుకు ఉండే డిమాండు పరిమాణానికీ ఉన్న సంబంధాన్ని డిమాండ్ రేఖ అంటారు.
  5. ↑ ఉదాహరణకు:
    జయంత్ విష్ణు నార్లికర్ (1938 జూలై 19- 2025 మే 20) విశ్వంలో జీవుల ఉనికిపై పరిశోధన చేసిన భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త.
    ఈ ఉదాహరణలో నార్లికర్ ఒక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అనీ, విశ్వంలో జీవుల ఉనికిపై పరిశోధించాడనీ, చెబుతుంది. ఆయన జీవించిన కాలాన్ని కూడా చూపిస్తోంది. ఈ వ్యాసాన్ని చదవడం ఈ వాక్యంతో ఆపేసిన పాఠకులకు కూడా ఆయన ఎవరు, ఎందుకు ఆయన ప్రసిద్ధి చెందాడు, ఎప్పుడు జీవించాడు అనే సంగతులు తెలిసిపోయాయి.)
  6. ↑ ఉదాహరణకు, ఇలా వాడాలి:
    నాగార్జున సాగర్ ప్రాజెక్టు కృష్ణానదిపై ఉన్న భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టు ...
    ఇలా రాయకూడదు:
    భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టు అయిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు కృష్ణానదిపై ...
  7. ↑ ఉదాహరణకు, "రావిశాస్త్రి" వ్యాసంలో:
    రావిశాస్త్రి (రాచకొండ విశ్వనాధశాస్త్రి) (1922 - 1993) వృత్తి రీత్యా న్యాయవాది, కథా రచయిత.
  8. ↑ ఉదాహరణకు, "యునైటెడ్ కింగ్‌డమ్" వ్యాసంలో:
    యునైటెడ్ కింగ్‌డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్దర్న్ ఐర్లాండ్ (వాడుకలో యునైటెడ్ కింగ్‌డం) పశ్చిమ ఐరోపాలోని స్వార్వభౌమ దేశం.
  9. ↑ ఉదాహరణకు, ఇలా రాయాలి:
    పొనుగుపాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, ...
    ఇలా రాయకూడదు:
    పొనుగుపాడు (ఫిరంగిపురం), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, ...
  10. ↑ అన్నీ కాకపోయినా చాలా వ్యాసాల్లో వ్యాసం పేరును బొద్దు చేస్తాం. వ్యాసానికి అదే వ్యాసం నుండి లింకు ఇస్తే, ఆ లింకు బొద్దుగా కనిపిస్తుంది. కానీ, ఈ పద్ధతిని అనుసరించరాదు. దీనివలన, పేజీని తరలించినపుడు పనికిరాని సర్క్యులర్ దారిమార్పు లింకు ఏర్పడుతుంది. బొద్దు చేసిన పాఠ్యంలో కొంత భాగానికి లింకు ఇవ్వడం కూడా చెయ్యకూడదు. దీనివలన బొద్దు చేసినదాని ఫలితం ఉండదు; ఈ లింకు వలన పాఠకులకు అసలు బొద్దు చేసి ఉందనే తెలియకపోవచ్చు, దాని ఉద్దేశాన్ని వాళ్ళు గ్రహించకపోవచ్చు.
  11. ↑ See WP:NOTALEDE for previous discussion of why "lede" is avoided in this guideline; in summary: it gives a false impression about the purpose, nature, and style of Wikipedia leads.

ప్రత్యేక వివరణాత్మక గమనిక

[మార్చు]

సూచనలు

[మార్చు]
  1. ↑ "wikipedia.org Competitive Analysis, Marketing Mix and Traffic". Archived from the original on 25 April 2022.