వరల్డ్ వైడ్ వెబ్
రాబర్ట్ కాయు రూపకల్పన చేసిన చారిత్రక వరల్డ్ వైడ్ వెబ్ లోగో. ప్రస్తుతానికి అందరి ఆమోదం పొందిన WWW లోగో ఏదీ లేదు. | |
| పొడిపదాలు | WWW |
|---|---|
| మొదలైన తేదీ | 1989 by టిమ్ బెర్నర్స్ లీ |
| సంస్థ | సెర్న్ |
వరల్డ్ వైడ్ వెబ్ (WWW లేదా వెబ్) అనేది అంతర్జాలం (ఇంటర్నెట్) ద్వారా సమాచారాన్ని పంచుకునే వేదిక. దీని ద్వారా సాంకేతిక నిపుణులే కాకుండా సామాన్యులు కూడా సులభంగా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే వీలుంటుంది.[1] ఇది హైపర్‌టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ (HTTP) యొక్క నిర్దిష్ట నిబంధనల ప్రకారం పత్రాలు, ఇతర వెబ్ వనరులను ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.[2]
వెబ్ ను ఆంగ్ల కంప్యూటర్ శాస్త్రవేత్త అయిన టిమ్ బెర్నర్స్ లీ 1989 లో సెర్న్ లో పనిచేస్తుండగా రూపొందించాడు. దీన్ని 1991 లో ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా సమాచార నెట్వర్క్ సృష్టించాలనే ఉద్దేశంతో దీనిని రూపొందించారు. పత్రాలు, ఇతర మీడియా కంటెంట్ వెబ్ సర్వర్ల ద్వారా నెట్‌వర్క్‌కు అందుబాటులో ఉంటాయి. వెబ్ బ్రౌజర్ల వంటి ప్రోగ్రామ్‌ల ద్వారా వీటిని యాక్సెస్ చేయవచ్చు. వరల్డ్ వైడ్ వెబ్‌లోని సర్వర్లు, వనరులను యూనిఫాం రిసోర్స్ లొకేటర్ (URL) ద్వారా గుర్తిస్తాము.
అసలైనవీ, ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నవీ హైపర్‌టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ (HTML) సాయంతో సృష్టించబడిన వెబ్ పేజీ డాక్యుమెంట్లే. HTML లో వాడుకరి ఇంటరాక్షన్ కి ఉపయోగపడే ప్లెయిన్ టెక్స్ట్, బొమ్మలు, ఆడియోలు, వీడియోలు, స్క్రిప్టులు మొదలైనవన్నీ ఇంప్లిమెంట్ చేసే వీలుంది. అందులో ఇతర వెబ్ రిసోర్సులకు దారి చూపే హైపర్ లింకులను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి హైపర్ లింకులను అనుసరిస్తూ వివిధ వెబ్ సైట్లలో విహరించడాన్ని వెబ్ నావిగేషన్ లేదా వెబ్ సర్ఫింగ్ అంటారు. వెబ్ అప్లికేషన్లు అంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్లలాగా పనిచేసే వెబ్ పేజీలు. వెబ్ లో సమాచారం HTTP (హైపర్‌టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్) ద్వారా అంతర్జాలంలో ప్రయాణిస్తూ ఉంటుంది. ఒకే రకమైన ఇతివృత్తం కలిగిన వెబ్ వనరులను కలిపి, సాధారణంగా ఒక డొమైన్ పేరుతో ఒక వెబ్సైటును తయారు చేస్తాయి. ఒకే వెబ్ సర్వర్ పలు వెబ్సైట్లను అందించవచ్చు. అయితే కొన్ని వెబ్సైట్లు, ముఖ్యంగా అత్యంత జనాదరణ పొందినవి బహుళ సర్వర్ల ద్వారా అందించబడవచ్చు. అనేక వ్యాపార, ప్రభుత్వ సంస్థలు, వ్యక్తిగత వినియోగదారులు వెబ్సైట్ కంటెంట్ ని సృష్టిస్తూ ఉంటారు. ఇందులో అపారమైన విద్యా, వినోదం, వాణిజ్య, ప్రభుత్వ సమాచారం ఉంది.
ప్రస్తుతం వెబ్ అనేది ప్రపంచంలో అత్యంత ప్రబలమైన సమాచార వేదిక.[3][4][5] ప్రపంచ వ్యాప్తంగా వందల కోట్లమంది ప్రజలు ఇంటర్నెట్ ని దీని ద్వారానే వినియోగిస్తున్నారు.
చరిత్ర
[మార్చు]
ఆంగ్ల కంప్యూటర్ శాస్త్రవేత్త టిమ్ బెర్నర్స్ లీ సెర్న్ లో పనిచేస్తుండగా వెబ్ ను ఆవిష్కరించాడు.[6][7] ప్రతిక్షణం మారుతూ ఉండే తను పనిచేసే పెద్ద సంస్థలో పత్రాలనూ, డేటా ఫైళ్ళనూ భద్రపరచడం, తాజాకరించడం, వెతుకులాడటం అనే సమస్యకు పరిష్కారం కనుగొనాలని అనుకున్నాడు. అంతే కాకుండా సెర్న్ తో కలిసి పనిచేసే బయటి సంస్థలతో సమాచారాన్ని పంచుకోవడం కూడా ఇందులో భాగమే. సాధారణంగా యునిక్స్ ఆపరేటింగ్ సిస్టం లో ఉండే ట్రీ నిర్మాణం ప్రకారం నిర్వహించడానికి ఆయనకు ఇష్టం లేదు. అలాగే వాక్స్ నోట్స్ తరహాలో కీవర్డ్స్ ఆధారంగా నిర్వహించే పద్ధతి కూడా అతనికి నచ్చలేదు. 1980 లో సెర్న్ లో తాను రూపొందించిన ఎన్క్వైర్ అనే ప్రైవేట్ సిస్టంలో భావనలను వాడటానికి నిర్ణయించుకున్నాడు. 1965 లో టెడ్ నెల్సన్ రూపొందించిన హైపర్ టెక్స్ట్ నమూనా గురించి తెలుసుకున్నాడు. అందులో పత్రాలలో ఉండే పాఠ్యంలోనే హాట్‌స్పాట్ అనబడే హైపర్ లింక్స్ ద్వారా మనకు ఇష్టం వచ్చిన రీతిలో అనుసంధానం చేసుకోవచ్చు. తాను ఆలోచిస్తున్న మార్గం సరైనదే అని ధృవపరిచిందీ భావన.[8][9]
ఈ నమూనా ఆపిల్ సంస్థ తయారు చేసిన హైపర్కార్డ్ మరింత ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది. అయితే బెర్నర్స్ లీ రూపొందించిన ఈ కొత్త వ్యవస్థ, హైపర్కార్డ్ లా కాకుండా, ఆది నుంచీ స్వతంత్రంగా పనిచేసే అనేక కంప్యూటర్ల మీద నడిచే డేటాబేసులు అనుసంధానించేలా, ఇంటర్నెట్ కి అనుసంధానమైన ఏ కంప్యూటర్ నుంచైనా, ఎంతమంది అయినా యాక్సెస్ చేసేలా రూపొందించబడింది. అంతే కాకుండా ఈ వ్యవస్థ రాబోయే కాలంలో కేవలం పాఠ్యం (టెక్స్ట్) మాత్రమే కాకుండా గ్రాఫిక్స్, మాటలు, వీడియో లాంటి వాటికి కూడా సహకారం ఉండాలని ప్రతిపాదించాడు. ఈ లింకులు మార్చగలిగే డేటా ఫైళ్ళను కూడా సూచించవచ్చు, అలాగే సర్వర్ మీద ప్రోగ్రాములు కూడా నడిపించవచ్చు. ఫైల్ సిస్టమ్స్, యూజ్‌నెట్ లాంటి సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించబడే ఫైళ్ళను కొత్త వ్యవస్థ ద్వారా యాక్సెస్ చేయడానికి "గేట్‌వే" పద్ధతిని కూడా సూత్రీకరించాడు. లింకులు సృష్టించడానికి ఒక కేంద్రీకృత నియంత్రణ అవసరం ఉండకూడదని నొక్కి చెప్పాడు.[10][11][6][7]
1989 మార్చిలో టిమ్ బెర్నర్స్ లీ తన ప్రతిపాదనను మొదటిసారిగా సెర్న్ కు నివేదించాడు.[10] అప్పటికి ఆయన ప్రతిపాదనకు ఎలాంటి పేరూ పెట్టలేదు. 1990 చివరినాటికి ఒక పనిచేసే వ్యవస్థను రూపొందించగలిగాడు. సెర్న్ లో పనిచేసే HTTP సర్వర్ ఇందులో ప్రధానభాగం. ఇంకా వరల్డ్‌వైడ్‌వెబ్ అనే బ్రౌజరు కూడా ఉంది. తర్వాత ప్రాజెక్టుకూ, దాని నెట్వర్క్ కూ అదే పేరు వాడారు. ఈ పనిలో భాగంగానే ఆయన HTTP ప్రోటోకాల్ మొదటి వర్షన్ తయారు చేశాడు. ఒక URL ఎలా ఉండాలి, అది ఎలా నిర్మితమై ఉంటుందో చెప్పాడు. HTML ను ప్రాథమిక డాక్యుమెంట్ ఫార్మాట్ గా చేశాడు.[12] జనవరి 1991 నాటికి ఈ సాంకేతికత సెర్న్ దాటి ఇతర పరిశోధనా సంస్థలకూ పాకింది. ఆగస్టు 23, 1991 నాటికి ఇంటర్నెట్ అంతటా వ్యాపించింది. వెబ్ సెర్న్ లో విజయవంతం అయ్యి, ఇంటర్నెట్ అంతటా వేగంగా విస్తరించింది. తర్వాతి రెండు సంవత్సరాలలో 50 వెబ్సైట్లు పుట్టుకువచ్చాయి.[13][14]
పని తీరు
[మార్చు]చాలా మంది ఇంటర్నెట్, వరల్డ్ వైడ్ వెబ్ ఒకటే అనుకుంటారు. కానీ ఆ రెండు పదాలు ఒకేదానిని సూచించవు. ఇంటర్నెట్ అనేది ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్లు టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారానో, లేక ఆప్టికల్ ఫైబర్ ద్వారానో కలిసి ఏర్పడ్డ ఒక నెట్వర్క్. వరల్డ్ వైడ్ వెబ్ ప్రపంచ వ్యాప్తంగా ఒకదానితో ఒకటి హైపర్ లింకుల ద్వారా అనుసంధానమైన పత్రాల సముదాయం. వెబ్ వనరులను మనం HTTP లేదా HTTPS అనే అప్లికేషన్ లెవెల్ ప్రోటోకాల్ ద్వారా పొందుతాం. ఇవి అంతర్గతంగా ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ని వాడుకుంటాయి.
ఒక వెబ్ పేజీని సందర్శించాలంటే బ్రౌజరులోకి వెళ్ళి URL టైపు చేయాలి, లేదా మరో పేజీలోనుంచి హైపర్ లింకుని నొక్కాలి. ఇందులో ఏది జరిగినా, సదరు వెబ్ పేజీని తీసుకువచ్చి మీకు చూపడానికి వెబ్ బ్రౌజర్, నేపథ్యంలో ఒక సోపాన క్రమంలో కొన్ని పనులు చేస్తుంది. 1990వ దశకంలో ఇలా బ్రౌజర్ ని ఉపయోగించి వెబ్ పేజీలను సందర్శించడానికి బ్రౌజింగ్, లేదా వెబ్ సర్ఫింగ్, వెబ్ నావిగేషన్ (వెబ్ విహారం) అని పిలవడం మొదలైంది.
మూలాలు
[మార్చు]- ↑ Wright, Edmund, ed. (2006). The Desk Encyclopedia of World History. New York: Oxford University Press. p. 312. ISBN 978-0-7394-7809-7.
- ↑ "What is the difference between the Web and the Internet?". W3C Help and FAQ. W3C. 2009. Archived from the original on 9 July 2015. Retrieved 16 July 2015.
- ↑ Bleigh, Michael (16 May 2014). "The Once And Future Web Platform". TechCrunch. Archived from the original on 5 December 2021. Retrieved 9 March 2022.
- ↑ "World Wide Web Timeline". Pews Research Center. 11 March 2014. Archived from the original on 29 July 2015. Retrieved 1 August 2015.
- ↑ Dewey, Caitlin (12 March 2014). "36 Ways The Web Has Changed Us". The Washington Post. Archived from the original on 9 September 2015. Retrieved 1 August 2015.
- 1 2 Quittner, Joshua (29 March 1999). "Network Designer Tim Berners-Lee". Time Magazine. Archived from the original on 15 August 2007. Retrieved 17 May 2010.
But the World Wide Web is Berners-Lee's alone. He designed it. He loosed it on the world. And he more than anyone else has fought to keep it open, non-proprietary and free.
[page needed] - 1 2 McPherson, Stephanie Sammartino (2009). Tim Berners-Lee: Inventor of the World Wide Web. Twenty-First Century Books. ISBN 978-0-8225-7273-2.
- ↑ Rutter, Dorian (2005). From Diversity to Convergence: British Computer Networks and the Internet, 1970-1995 (PDF) (Computer Science thesis). The University of Warwick. Archived (PDF) from the original on 10 October 2022. Retrieved 27 December 2022.
- ↑ Tim Berners-Lee (1999). Weaving the Web. Internet Archive. HarperSanFrancisco. pp. 5–6. ISBN 978-0-06-251586-5.
- 1 2 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు; "TBL Web Proposal" అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Berners-Lee, T.; Cailliau, R.; Groff, J.-F.; Pollermann, B. (1992). "World-Wide Web: The Information Universe". Electron. Netw. Res. Appl. Policy (in ఇంగ్లీష్). 2: 52–58. doi:10.1108/eb047254. ISSN 1066-2243. Archived from the original on 27 December 2022. Retrieved 27 December 2022.
- ↑ W3 (1991) Re: Qualifiers on Hypertext links Archived 7 డిసెంబరు 2021 at the Wayback Machine
- ↑ Hopgood, Bob. "History of the Web". w3.org. The World Wide Web Consortium. Archived from the original on 21 March 2022. Retrieved 12 February 2022.
- ↑ "A short history of the Web". CERN (in ఇంగ్లీష్). Archived from the original on 17 April 2022. Retrieved 15 April 2022.
ఇంకా చదవడానికి
[మార్చు]- Berners-Lee, Tim; Bray, Tim; Connolly, Dan; Cotton, Paul; Fielding, Roy; Jeckle, Mario; Lilley, Chris; Mendelsohn, Noah; Orchard, David; Walsh, Norman; Williams, Stuart (15 December 2004). "Architecture of the World Wide Web, Volume One". W3C. Version 20041215.
- Berners-Lee, Tim (August 1996). "The World Wide Web: Past, Present and Future". W3C.
- Niels Brügger, ed. Web History (2010), 362 pages; Historical perspective on the World Wide Web, including issues of culture, content, and preservation.
- Brügger, Niels, ed, Web25: Histories from the first 25 years of the World Wide Web (Peter Lang, 2017).
- Fielding, R.; Gettys, J.; Mogul, J.; Frystyk, H.; Masinter, L.; Leach, P.; Berners-Lee, T. (June 1999). "Hypertext Transfer Protocol – HTTP/1.1". Request For Comments 2616. Information Sciences Institute.
- James Gleick, "How the Web Was Lost" (review of Tim Berners-Lee with Stephen Witt, This Is for Everyone: The Unfinished Story of the World Wide Web, Farrar, Straus and Giroux, 2025, 389 pp.; Joanna Walsh, Amateurs! How We Built Internet Culture, and Why It Matters, Verso, 2025, 262 pp.; and Cory Doctorow, Enshittification: Why Everything Suddenly Got Worse and What to Do About It, MCD, 338 pp.), The New York Review of Books, vol. LXXII, no. 19 (4 December 2025), pp. 6, 8, 10.
- Polo, Luciano (2003). "World Wide Web Technology Architecture: A Conceptual Analysis". New Devices.
- Skau, H.O. (March 1990). "The World Wide Web and Health Information". New Devices.