Jump to content

ముస్తఫా కమాల్ అతాతుర్క్

వికీపీడియా నుండి
ముస్తఫా కమాల్ అతాతుర్క్
ముస్తఫా కమాల్ అతాతుర్క్


పదవీ కాలం
29 అక్టోబరు 1923 – 10 నవంబర్ 1938
తరువాత ఇస్మత్ ఇనోను

పదవీ కాలం
3 మే 1920 – 24 జనవరి 1921
తరువాత ఫెయూజి చక్మక్

పదవీ కాలం
24 ఏప్రిల్ 1920 – 29 అక్టోబరు 1923
తరువాత అలీ ఫతెహి ఒక్యార్

పదవీ కాలం
1919 – 1938
తరువాత ఇస్మత్ ఇనోను

వ్యక్తిగత వివరాలు

జననం (1881-05-19)1881 మే 19
సెలానిక్ (థెస్సలోనికీ)
మరణం 1938 నవంబరు 10(1938-11-10) (వయసు: 57)
దొలంబాచే సౌధం, ఇస్తాంబుల్
జాతీయత టర్కిష్
రాజకీయ పార్టీ రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ
జీవిత భాగస్వామి లతీఫే ఉసక్‌లిగిల్ (1923–25)
సంతకం ముస్తఫా కమాల్ అతాతుర్క్'s signature
పురస్కారాలు జాబితా (24 పతకాలు)
External Timeline

ముస్తఫా కమాల్ అతాతుర్క్ (మే 19 1881 - నవంబర్ 10 1938) ఒక టర్కిష్ సైనికాధికారి మరియు రాష్ట్రప్రతినిధి. ఉద్యమకారుడు. రిపబ్లిక్ ఆఫ్ టర్కీ వ్యవస్థాపకుడు. 1923 నుండి 1938లో మరణించే వరకు ఆ దేశ తొలి అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన చేపట్టిన విస్తృత సంస్కరణల ద్వారా టర్కీని లౌకిక, పారిశ్రామికీకరణ చెందుతున్న దేశంగా మార్చాడు. భావజాలపరంగా ఆయన లౌకికవాది, గణతంత్రవాది, జాతీయవాది. ఆయన విధానాలు, సామాజిక-రాజకీయ సిద్ధాంతాలు తరువాత కెమలిజంగా ప్రసిద్ధి చెందాయి.ఇతనికి "టర్కీ జాతిపిత "గా అభివర్ణిస్తారు.

అటాటుర్క్ ఒట్టోమన్ సామ్రాజ్యంలోని సలోనికాలో జన్మించారు. ఆ నగర సుల్తాన్ అబ్దుల్ హమీద్ II నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించినందుకు, తన యుక్త వయసులోనే అణచివేతను ఎదుర్కొన్నాడు. తర్వాత కమిటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్, యంగ్ టర్క్స్ వంటి ప్రతిపక్ష ఉద్యమాల్లో చేరాడు. ఆయన యంగ్ టర్క్స్ విప్లవం, 31 మార్చి ఘటనల్లో పాల్గొన్నాడు. సైన్యాన్ని రాజకీయీకరించడాన్ని ప్రోత్సహిస్తున్నారని కమిటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ నాయకత్వాన్ని అటాటుర్క్ బహిరంగంగా ఖండినందుకు, ఆ సంస్థ కొత్త నిరంకుశ పాలనను నెలకొల్పుతున్న సమయంలో ఆయనను పక్కన పెట్టారు. అటాటుర్క్ తన ప్రారంభ సైనిక జీవితంలో ఇటాలో-టర్కిష్ యుద్ధం, బాల్కన్ యుద్ధాలుల్లో పాల్గొన్నాడు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో గల్లిపోలీ రక్షణలో పోషించిన పాత్రతో ఆయన ప్రఖ్యాతి పొందాడు. యుద్ధంలో తన దేశం ఓటమి చెందిన తరువాత, టర్కీ స్వాతంత్రయ యుద్ధంలో విజేత మిత్రపక్షాలు టర్కీని విభజించేందుకు చేసిన ప్రయత్నాలకు వ్యతిరేకంగా టర్కీ జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహించి జాతీయవాద ప్రతిఘటన చేసారు. తాత్కాలిక అంకారా ప్రభుత్వాన్ని స్థాపించి, గ్రీస్, ఆర్మేనియా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్లకు వ్యతిరేకంగా టర్కీ విజయాన్ని సాధించాడు. ఈ విజయానికి లౌసాన్ ఒప్పందం ద్వారా అధికారిక గుర్తింపు లభించింది. అనంతరం ఆయన ప్రభుత్వం 1922లో ఒట్టోమన్ సుల్తానేట్‌ను రద్దు చేసి, 1923లో రిపబ్లిక్ అఫ్ టర్కీని ప్రకటించింది.

కొత్తగా ఏర్పడిన రిపబ్లిక్ అఫ్ టర్కీ అధ్యక్షుడిగా అటాటుర్క్, ఆధునికమైన, పాశ్చాత్య ధోరణి కలిగిన సమాజంతో కూడిన గణతంత్ర, లౌకిక జాతీయ రాష్ట్రాన్ని నిర్మించేందుకు విస్తృత సంస్కరణలను ప్రవేశపెట్టాడు. 1920ల మధ్యకాలానికి ఆయన చుట్టూ ఏకపక్ష పాలనా వ్యవస్థ బలపడడంతో అతనికి వ్యతిరేకంగా ఉన్నవారు అణచబడ్డారు. విస్తృత లౌకికీకరణ కార్యక్రమంలో భాగంగా ఒట్టోమన్ ఖలీఫాత్ను రద్దు చేయడం, మత ప్రభావాన్ని పరిమితం చేయడం కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. పాక్షిక లౌకిక మెసెల్లే స్థానంలో పూర్తి లౌకిక పౌర చట్టాన్ని ప్రవేశపెట్టారు. పాశ్చాత్య సాంస్కృతిక ఆచారాలు ప్రోత్సహించబడ్డాయి: ఉదాహరణకు ఫెజ్(టోపీ) మరియు కొన్ని పురుషుల దుస్తుల నిషేధం. ప్రభుత్వ యాజమాన్య సంస్థలు స్థాపించబడ్డాయి, విదేశీ పారిశ్రామిక ఆస్తులు జాతీయం చేయబడ్డాయి, మరియు మొదటి పంచవర్ష ప్రణాళిక అమలు చేయబడింది. ఆయన వేలాది పాఠశాలలను ప్రారంభించి, లాటిన్ లిపి ఆధారిత టర్కిష్ వర్ణమాలను ప్రవేశపెట్టాడు. ఆయన పదవికాలంలో టర్కీ మహిళలకు సమాన పౌర, రాజకీయ హక్కులు లభించాయి. ఆయన ప్రభుత్వం టర్కీకరణ విధానాన్ని అమలు చేస్తూ, టర్కీ జాతీయ గుర్తింపు కింద ఏకరీతి, ఐక్యమైన, ముఖ్యంగా లౌకిక దేశాన్ని నిర్మించడానికి ప్రయత్నించింది. అటాటుర్క్ ఇరాన్, యుగోస్లావియా, ఇరాక్, రొమేనియా, గ్రీస్ దేశాలతో సంబంధాలను మెరుగుపరచేందుకు ప్రయత్నించాడు. అలాగే 1930ల అంతర్యుద్ధాల మధ్యకాలంలో ఇటలీ, బల్గేరియా విస్తరణవాద దూకుడును ఎదుర్కొనే ఉద్దేశంతో బాల్కన్ ఒప్పందం ఏర్పాటులో భాగమయ్యాడు. ఆయన 57 ఏళ్ల వయసులో 1938 నవంబరు 10న ఇస్తాంబుల్లోని డోల్మాబాహ్చే ప్యాలెస్లో మరణించాడు. అనంతరం ఆయన దీర్ఘకాల ప్రధానమంత్రి ఇస్మెట్ ఇనోను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు.

అటాటుర్క్ తన సైనిక విజయాలు, జాతి నిర్మాణ ప్రయత్నాలు, సామాజిక, ఆర్థిక సంస్కరణలు, దౌత్య విజయాల కారణంగా ప్రశంసలు పొందాడు. ఆయన వలసవాద వ్యతిరేక, సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచాడు.అదే సమయంలో, నియంతృత్వ పాలనను నెలకొల్పడం, కుర్దులు వంటి మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్న సమీకరణ విధానాలను ప్రవేశపెట్టడం, అలాగే కమిటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ (సియుపి) పాలనలో ప్రారంభమైన క్రైస్తవ మైనారిటీలపై అణచివేతను కొనసాగించాడనే కారణాలతో ఆయన విమర్శలకు గురయ్యాడు. మరోవైపు, ఆయన లౌకిక విధానాలను సంప్రదాయవాద ముస్లింలు విమర్శించారు. రిపబ్లిక్ అఫ్ టర్కీ నిర్మాణంలో ఆయన పోషించిన పాత్రకు గుర్తింపుగా, టర్కీ పార్లమెంటు 1934లో ఆయనకు అటాటుర్క్ అనే ఇంటిపేరును ప్రదానం చేసింది. దీనికి “టర్కీ పితామహుడు” లేదా “తన పూర్వీకుల వంటి టర్కు” అనే అర్థాలు ఉన్నాయి.


ముస్తఫా కమాల్ పాషా తనకుతాను ఒక బలిష్ట సైనికాధికారిగా మార్చుకున్నాడు. గల్లిపోలీ యుద్ధం లో ఒక డివిజన్ కమాండర్ గా సమర్థంగా పనిచేశాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొని పేరుగాంచాడు.[1] ఉస్మానియా సామ్రాజ్యం అల్లైస్ సేనల చేతిలో పరాజయం పాలైన తరువాత, కమాల్ టర్కిష్ జాతీయ ఉద్యమం నడిపాడు. ఈ ఉద్యమం చివరకు టర్కీ స్వతంత్ర సంగ్రామంగా మారింది. అంకారాను ప్రాంతీయ రాజధానిగా మార్చుకుని, అల్లైడ్ బలగాలను ఓడించాడు. ఇతడి విజయస్ఫూర్తిగల దృష్టి ఇతనికి అనేక విజయాలను తెచ్చి పెట్టింది. చివరకు ఇతను తన దీటైన రాజకీయ సైనిక చాతుర్యాలతో రిపబ్లిక్ ఆఫ్ టర్కీని స్థాపించగలిగాడు.

ఇతను అనేక సంస్కరణలు చేపట్టాడు. అందులో ప్రధానంగా రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సంస్కరణలు. ఇతను ఉస్మానియా సామ్రాజ్యానికి రూపుమాపి, టర్కీని ఓ ప్రజాతంత్ర సెక్యులర్ రాజ్యంగా తీర్చిదిద్దాడు.

ప్రారంభ జీవితం

[మార్చు]

ముస్తఫా కెమాల్ ఒట్టోమన్ సామ్రాజ్యంలోని సలోనికా (సెలానిక్)లో [2]జన్మించాడు. అతని తల్లిదండ్రులు అలీ రిజా ఎఫెండి, జుబేదె హనీమ్. కొజాజిక్ (కొజాజిక్) ప్రాంతానికి చెందిన అలీ రిజా ఎఫెండి సైనిక అధికారిగా, భూ హక్కుల పత్రాల గుమాస్తాగా, మరియు కలప వ్యాపారిగా పనిచేశాడు. ముస్తఫా తోబుట్టువుల్లో మక్బూలె అటాదాన్ అనే సోదరి మాత్రమే బాల్యాన్ని దాటి జీవించింది. ఆమె 1956లో మరణించింది[3]. ముస్తఫా కెమాల్ అటాటుర్క్, మాక్బులే అటాడాన్, ఇతర కుటుంబ సభ్యులు, అలాగే అటాటుర్క్ కుటుంబాన్ని వ్యక్తిగతంగా తెలిసిన అతని బాల్య స్నేహితుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం, అలీ రిజా ఎఫెండి మొదట సలోనికాకు చెందినవాడు. ఆయన భార్య జుబేదె హనీమ్ 1857లో సలోనికాకు పశ్చిమాన ఉన్న లంగాజా ప్రాంతంలోని రైతు కుటుంబంలో జన్మించింది[4].

పేరు

[మార్చు]

అటాటుర్క్‌కు జన్మనిచ్చినప్పుడు ముస్తఫా అనే పేరు పెట్టారు. ఆయన రెండో పేరు కెమాల్ ఎలా వచ్చిందన్న విషయంపై భిన్న కథనాలు ఉన్నాయి. అరబిక్‌లో కెమాల్ అనే పదానికి 'పరిపూర్ణత' లేదా 'పరిపక్వత' అనే అర్థాలు ఉన్నాయి. అటాటుర్క్ సామర్థ్యం, పరిపక్వతను మెచ్చిన ఆయన గణిత ఉపాధ్యాయుడు ఈ పేరును పెట్టాడని కొందరు పేర్కొంటారు[5]. అయితే, ఆ ఉపాధ్యాయుడి పేరు కూడా ముస్తఫానే కావడంతో ఇద్దరినీ వేరు చేసి గుర్తించేందుకు ఆయనకు కెమాల్ అనే పేరు పెట్టాడని మరికొందరు అంటారు[6][7]. ఆండ్రూ మ్యాంగో అభిప్రాయం ప్రకారం, జాతీయవాద కవి నామిక్ కెమాల్ గౌరవ సూచకంగా అటాటుర్క్ స్వయంగా ఈ పేరును ఎంచుకొని ఉండవచ్చు. 1934లో తన గుర్తింపు పత్రంలో అటాటుర్క్ అనే ఇంటిపేరు పొందిన తర్వాత ఆయన పేరు కెమాల్ అటాటుర్క్‌గా నమోదైంది; వ్యక్తిగత పేరు ముస్తఫా పూర్తిగా తొలగిపోయింది. 1935 నుంచి 1937 వరకు ఆయన ప్రాచీన టర్కిక్ మూలమున్న కమాల్ (Kamâl) అనే పేరును ఉపయోగించాడు. ఈ పదానికి 'కోట','సైన్యం', లేదా 'డాలు' అనే అర్థాలు ఉన్నాయి.[8][9][10]

పూర్వీకులు

[మార్చు]

ముస్తఫా కెమాల్ వంశపారంపర్యం గురించి ఉన్న వాదనలు, సిద్ధాంతాలు చాలా విభిన్నంగా, పరస్పర విరుద్ధంగా ఉన్నాయి.[11] ఆండ్రూ మ్యాంగో ప్రకారం, అతని కుటుంబం ముస్లిం, టర్కిష్ భాష మాట్లాడే, ఆర్థికంగా స్థిరత్వం తక్కువగా ఉన్న మధ్యతరగతి కుటుంబం.[12] అతని తండ్రి అలీ రిజా అల్బేనియన్ లేదా స్లావిక్ మూలాలకు చెందినవాడని కొందరు రచయితలు భావించారు.[13][14][15] అయితే హెచ్. సి. ఆర్మ్‌స్ట్రాంగ్, ఫాలిహ్ రిఫ్కీ అతాయ్, వామిక్ డి. వోల్కన్, నార్మన్ ఇక్టోవిట్జ్, ముజ్గాన్ జున్బూర్, నుమాన్ కార్తాల్, హసన్ ఇజ్జెట్టిన్ దినామో ప్రకారం, అలీ రిజా పూర్వీకులు టర్కులు. వారి మూలాలు చివరికి అనటోలియాలోని ఐదిన్ ప్రావిన్స్కకు చెందిన సోకే ప్రాంతానికి చేరుతాయని వారు పేర్కొన్నారు.[16][17] టోర్బ్స్ సముదాయం చేసిన వాదనల ప్రకారం, అతను ముస్లిం స్లావులైన పొమాక్స్ (బల్గేరియన్ ముస్లింలు) లేదా టోర్బెషి (మాసిడోనియన్ ముస్లింలు) వంశానికి చెందినవాడు.[11] అతని తల్లి జుబేదె టర్కిష్ మూలాలకు చెందినదిగా భావిస్తారు.[16][13][14] ఇతర ఆధారాల ప్రకారం, ఆమె టర్కిక్ యోరుక్ వంశానికి చెందినది. ఆమెకు అల్బేనియన్ లేదా మాసిడోనియన్ పూర్వీకులు ఉన్నారని కూడా వాదనలు ఉన్నాయి.[18][15] ఒట్టోమన్ కాలంలో సలోనికా విలాయత్‌లో ముస్లింలు (ప్రధానంగా టర్కులు), గ్రీకులు, బల్గేరియన్లు మరియు ఇతర వర్గాలతో పాటు పెద్ద సంఖ్యలో యూదు సమాజం కూడా ఉండేది. దీని కారణంగా, ముస్తఫా కెమాల్ ప్రవేశపెట్టిన సంస్కరణల పట్ల తీవ్ర అసంతృప్తి చెందిన ఆయన ఇస్లామిక్ ప్రత్యర్థులు చాలా మంది, ఆయనకు యూదు 'దోన్మే'(ముస్లింలుగా మారిన యూదులు) పూర్వీకులు ఉన్నారని ఆరోపించారు.

విద్యాభ్యాసం

[మార్చు]

ముస్తఫా కెమాల్ చిన్నవయసులో ఉన్నప్పుడు అతని తల్లి అతన్ని మతపరమైన పాఠశాలలో చదివించాలని ప్రోత్సహించింది. అయితే అతను ఇష్టంలేకుండానే కొద్దికాలం మాత్రమే అక్కడ చదివాడు. తరువాత, తన తండ్రి సూచనతో మరింత లౌకిక పాఠ్యాంశాలు బోధించే ప్రైవేటు పాఠశాల అయిన షెమ్సి ఎఫెండి పాఠశాలలో చేరాడు. అతనికి ఏడు సంవత్సరాల వయసులో తండ్రి మరణించాడు. అతని తల్లి అతను ఏదైనా వృత్తి నేర్చుకోవాలని కోరుకున్నప్పటికీ, వారిని సంప్రదించకుండా ముస్తఫా కెమాల్ 1893లో సలోనికా మిలిటరీ స్కూల్ ప్రవేశ పరీక్ష రాశాడు. 1896లో అతను మొనాస్టిర్ మిలిటరీ హై స్కూల్లో చేరాడు. . ఇది ప్రస్తుతం ఉత్తర మాసిడోనియాలోని బిటోలాలో ఉంది. అక్కడ అతను గణితంలో విశేష ప్రతిభ కనబరిచాడు. 1899 మార్చి 14న, ఒట్టోమన్ సామ్రాజ్య రాజధాని కాన్స్టాంటినోపుల్లోని షిష్లీ జిల్లాలో ఉన్న పాంగాల్టీ ప్రాంతంలోని ఒట్టోమన్ మిలిటరీ అకాడమీలో చేరాడు. ప్రస్తుత ఇస్తాంబుల్లో ఉన్న ఈ అకాడమీ నుంచి 1902లో పట్టభద్రుడయ్యాడు. అనంతరం కాన్స్టాంటినోపుల్‌లోని ఒట్టోమన్ మిలిటరీ కాలేజ్ నుంచి 1905 జనవరి 11న పట్టభద్రుడయ్యాడు.

ఒట్టోమన్ సామ్రాజ్యంలోని సలోనికా నగరంలో అటాటుర్క్ జన్మించారు. ఆ ఇల్లు ప్రస్తుతం సంగ్రహాలయంగా ఉంది.

సైనిక జీవితం

[మార్చు]

ప్రారంభ సంవత్సరాలు

[మార్చు]

పట్టభద్రుడైన కొద్దికాలానికే అబ్దుల్ హమీద్ II పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యకలాపాల కారణంగా అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని నెలలు నిర్బంధంలో ఉంచిన తరువాత, అతని పూర్వ పాఠశాల డైరెక్టర్ రిజా పాషా సహకారంతోనే విడుదలయ్యాడు. విడుదలైన తరువాత ముస్తఫా కెమాల్‌ను అలీ ఫుఆత్ (సెబెసోయ్), లూత్ఫీ ముఫిత్ (ఓజ్దెష్)లతో కలిసి డమాస్కస్ కేంద్రంగా పనిచేసే ఐదవ సైన్యంలో 'స్టాఫ్ కెప్టెన్'గా నియమించారు. వ్యాపారి ముస్తఫా ఎల్వాన్ (కాంతేకిన్) నాయకత్వంలో సంస్కరణవాద సైనిక అధికారులు ఏర్పాటు చేసిన చిన్న రహస్య విప్లవ సంస్థ వతన్ వె హుర్రియెట్ ('మాతృభూమి మరియు స్వేచ్ఛ')లో అతను చేరాడు. 1907 జూన్ 20న అతనికి సీనియర్ కెప్టెన్ (Kolağası) హోదాకు పదోన్నతి లభించింది. అదే సంవత్సరం అక్టోబరు 13న మనస్తిర్లోని మూడవ సైన్యం ప్రధాన కార్యాలయానికి నియమితుడయ్యాడు. తరువాత అతను సభ్యత్వ సంఖ్య 322తో కమిటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్లో చేరాడు. అయితే తరువాతి సంవత్సరాల్లో ఆ సంస్థ నాయకత్వం అనుసరించిన విధానాలను తరచుగా విమర్శిస్తూ, వాటిని వ్యతిరేకించిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. 1908 జూన్ 22న తూర్పు రుమేలియాలోని ఒట్టోమన్ రైల్వేల ఇన్‌స్పెక్టర్‌గా (Doğu Rumeli Bölgesi Demiryolları Müfettişi) నియమితుడయ్యాడు. అయితే ఈ పదవి కారణంగా 1908 యంగ్ టర్క్స్ విప్లవంలో అతనికి ప్రధాన పాత్ర లభించలేదు.

సైన్యాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని ముస్తఫా కెమాల్ ప్రతిపాదించాడు. అయితే ఈ ప్రతిపాదన కమిటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ (CUP) నాయకులకు నచ్చలేదు. దాంతో, 1908 చివర్లో ఒక గిరిజన తిరుగుబాటును అణచివేయాలనే కారణంతో అతన్ని ట్రిపోలిటేనియా విలాయత్కు పంపించారు. ఆ ప్రాంతం ప్రస్తుతం లిబియాలో భాగంగా ఉండగా, అప్పట్లో ఒట్టోమన్ సామ్రాజ్యానికి చెందిన భూభాగం. అయితే మికుష్ ప్రకారం, ఈ బాధ్యత కోసం ముస్తఫా కెమాల్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. అతను తిరుగుబాటును అణచివేసి, 1909 జనవరిలో కాన్స్టాంటినోపుల్‌కు తిరిగి వచ్చాడు.

1909 ఏప్రిల్‌లో కాన్స్టాంటినోపుల్‌లో కొందరు సైనికులు ప్రతివిప్లవానికి దిగారు (చూడండి: 31 మార్చి ఘటన). ఈ తిరుగుబాటును అణచివేయడంలో, సుల్తాన్ అబ్దుల్ హమీద్ IIను పదవి నుంచి తొలగించడంలో ముస్తఫా కెమాల్ కీలక పాత్ర పోషించాడు. 1910లో అతన్ని అల్బేనియాలోని ఒట్టోమన్ ప్రావిన్సులకు పిలిపించారు. ఆ సమయంలో ఇసా బొలెటిని కొసావోలో అల్బేనియన్ తిరుగుబాట్లకు నాయకత్వం వహిస్తుండగా, అల్బేనియాలో కూడా తిరుగుబాట్లు జరుగుతున్నాయి. 1910లో ముస్తఫా కెమాల్ అల్బేనియన్ ప్రభువు, రాజకీయవేత్త, రచయిత, అలాగే అల్బేనియన్ స్వాతంత్య్ర ప్రకటన ప్రతినిధుల్లో ఒకరైన ఎక్రెమ్ వ్లోరాను కలిశాడు. తరువాత 1910 శరదృతువులో, ఫ్రాన్స్‌లోని పికార్డీ ప్రాంతంలో జరిగిన సైనిక విన్యాసాలకు హాజరైన ఒట్టోమన్ సైనిక పరిశీలకుల బృందంలో అతను కూడా ఉన్నాడు. 1911లో కొద్దికాలం కాన్స్టాంటినోపుల్‌లోని యుద్ధ మంత్రిత్వ శాఖ (Harbiye Nezareti)లో పనిచేశాడు.

ఇటలీ-టర్కీ యుద్ధం (1911–1912)

[మార్చు]

1911లో, ఒట్టోమన్ సామ్రాజ్యంలోని త్రిపోలిటానియా విలాయత్ (ప్రస్తుత లిబియా)లో జరిగిన ఇటలీ–టర్కీ యుద్ధంలో పోరాడేందుకు ఆయన స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. ఆయన ప్రధానంగా దెర్నా, టోబ్రుక్ పరిసర ప్రాంతాల్లో సేవలందించాడు. దండెత్తి వచ్చిన ఇటలీ సైన్యంలో 150,000 మంది సైనికులు ఉండగా, దానిని ఎదుర్కొన్నవారిలో 20,000 మంది బెదూయిన్లు, 8,000 మంది టర్కీ సైనికులు ఉన్నారు. ఇటలీ యుద్ధం ప్రకటించడానికి కొంతకాలం ముందు, లిబియాలో ఉన్న ఒట్టోమన్ సైనికుల్లో చాలామందిని అక్కడి తిరుగుబాటును అణచివేయడానికి ఒట్టోమన్ సామ్రాజ్యంలోని యమన్ విలాయత్కు పంపించారు. దీంతో లిబియాలో ఇటలీ సైన్యాన్ని ఎదుర్కోవడానికి ఒట్టోమన్ ప్రభుత్వానికి తగినంత సైనిక బలం లేకుండా పోయింది. ఈజిప్టు, సూడాన్‌లను తన ఆధీనంలో ఉంచుకున్న బ్రిటన్, ఈజిప్టు మీదుగా అదనపు ఒట్టోమన్ సైనికులు లిబియాకు చేరుకోవడానికి అనుమతించలేదు.

ముస్తఫా కెమాల్ వంటి ఒట్టోమన్ సైనికులు లిబియాకు చేరుకోవడానికి అరబ్బుల వేషధారణలో ప్రయాణించేవారు. ఈజిప్టులోని బ్రిటిష్ అధికారులకు వారు గుర్తిస్తే జైలు శిక్ష పడే ప్రమాదం ఉండేది. మరో మార్గం అందుబాటులో ఉన్న అతి కొద్ది పడవల ద్వారా ప్రయాణించడం. అయితే, నౌకాదళంలో ఇటలీకి ఉన్న ఆధిక్యం కారణంగా, త్రిపోలీకు వెళ్లే సముద్ర మార్గాలపై ఇటలీ సమర్థవంతంగా నియంత్రణ సాధించింది. ఇన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, లిబియాలో ముస్తఫా కెమాల్ నాయకత్వంలోని దళాలు పలుమార్లు ఇటలీ సైన్యాన్ని వెనక్కి నెట్టగలిగాయి. ఇందుకు ఉదాహరణగా, 1911 డిసెంబరు 22న జరిగిన టోబ్రుక్ యుద్ధాన్ని పేర్కొనవచ్చు.

1912 జనవరి 16-17 తేదీల్లో జరిగిన దెర్నా యుద్ధం సమయంలో, ముస్తఫా కెమాల్ ఇటలీ ఆధీనంలో ఉన్న కస్ర్-ఇ హారున్ కోటపై దాడి చేస్తున్నప్పుడు, రెండు ఇటలీ విమానాలు ఒట్టోమన్ సైనికులపై బాంబులు వేశాయి. దెబ్బతిన్న భవనం శిథిలాల నుంచి ఎగిరివచ్చిన సున్నపురాయి ముక్క ఆయన ఎడమ కంటికి తగిలింది. దీనివల్ల కంటి కణజాలానికి శాశ్వత నష్టం కలిగినప్పటికీ, ఆయన చూపు పూర్తిగా కోల్పోలేదు. ఆయన దాదాపు నెలరోజుల పాటు వైద్య చికిత్స పొందాడు.కేవలం రెండు వారాల చికిత్స తరువాతే రెడ్ క్రెసెంట్ వైద్య కేంద్రాలయాన్ని విడిచి వెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే, కంటి పరిస్థితి మరింత దిగజారడంతో తిరిగి వచ్చి చికిత్స కొనసాగించాల్సి వచ్చింది. 1912 మార్చి 6న ముస్తఫా కెమాల్ దెర్నాలోని ఒట్టోమన్ సైనిక దళాల కమాండర్‌గా నియమితుడయ్యాడు. 1912 అక్టోబరు 18న ఇటలీ-టర్కీ యుద్ధం ముగిసేవరకు ఆయన నగరాన్ని, దాని చుట్టుపక్కల ప్రాంతాలను రక్షిస్తూ తన ఆధీనంలో ఉంచగలిగాడు. 1912 అక్టోబరు 8న బాల్కన్ యుద్ధాలు ప్రారంభమైన తరువాత, ముస్తఫా కెమాల్, ఎన్వర్ బే, ఫెథీ బే, ఇతర ఒట్టోమన్ సైనిక కమాండర్లు ఒట్టోమన్ యూరప్కు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. యుద్ధంలో ఓడిపోవడంతో, ఒట్టోమన్ ప్రభుత్వం ప్రస్తుత లిబియాలోని మూడు ప్రాంతాలైన త్రిపోలిటానియా, ఫెజ్జాన్, సైరెనైకాలను ఇటలీ రాజ్యానికి అప్పగించాల్సి వచ్చింది. ఈ మేరకు 1912 అక్టోబరు 18న, బాల్కన్ యుద్ధాలు ప్రారంభమైన పది రోజుల తరువాత, ఔషీ ఒప్పందం కుదిరింది. 1923 నుంచి, ఈ ఒప్పందాన్ని తరువాత కుదిరిన లౌసాన్ ఒప్పందం (1923)తో వేరు చేసి గుర్తించేందుకు చరిత్రకారులు దీనిని సాధారణంగా “ఔషీ ఒప్పందం” అని పిలవడం ప్రారంభించారు. ఈ పేరు, ఒప్పందంపై సంతకాలు జరిగిన లౌసాన్ నగరంలోని షాటో ద్‌ఔషీ భవనం పేరు నుంచి వచ్చింది. 1923 లౌసాన్ ఒప్పందం మాత్రం మొదటి ప్రపంచ యుద్ధ మిత్రరాజ్యాలకు, టర్కీ గ్రాండ్ నేషనల్ అసెంబ్లీకి మధ్య అంకారాలో కుదిరింది.

  • లిపి సంస్కరణ :1928 నవంబర్ 1 నుండి టర్కీభాషకు కొత్త అక్షరమాల ప్రవేశపెట్టాడు.అప్పటివరకు ఉలేమాల పరిధిలో మాత్రమే పరిమితంగా ఉన్న పార్శీ -అరబిక్ లిపి స్థానంలోకి అప్పటికే పాలకభాషగా అభివృద్ధి చెంది,ప్రజాదరణ పొందిన లాటిన్ లిపిని రప్పించాడు.టర్కీ భాష ఉచ్చరణకు వీలుగా 23 ఆంగ్లాక్షరాలకు అదనంగా అవసరమైన [ Ç, Ğ, I, İ, Ö, Ş, Ü ] అనే 6 గుర్తులను కలిపి 8అచ్చులు,21హల్లులుతో 29 అక్షరాలను సమకూర్చారు.ఇందువలన భాష చదవటం రాయటం సులభమై అక్షరాస్యత పెరిగింది.

ఇవీ చూడండి

[మార్చు]

పాదపీఠికలు

[మార్చు]
  1. ↑ Zürcher, Turkey : a modern history, 142
  2. ↑ Anastassiadou, Méropi; Anastassiadou-Dumont, Méropi (1997). Salonique, 1830-1912: une ville ottomane à l'âge des Réformes (in ఫ్రెంచ్). BRILL. ISBN 978-90-04-10798-4.
  3. ↑ Granda, Cemal Çelebi (2007). Atatürk'ün Uşağı: Cemal Granda anlatıyor (in టర్కిష్). Pal Medya ve Organizasyon. ISBN 978-9944-203-01-2.
  4. ↑ Acar, Derya Genç (2005-11-01). "Makbule Atadan'ın Atatürk'e İlişkin Anlattıkları Üzerine Bir Basın Taraması". Atatürk Araştırma Merkezi Dergisi (in టర్కిష్). 21 (63). Atatürk Araştırma Merkezi Başkanlığı: 1091–1111. ISSN 1011-727X.
  5. ↑ Afetinan, A. (1959). Atatürk hakkında hâtıralar ve belgeler (in టర్కిష్). Türk Tarih Kurumu Basımevi.
  6. ↑ Cebesoy, Ali Fuat (1967). Sınıf arkadaşım Atatürk: okul ve genç subaylık hâtıraları (in టర్కిష్). İnkılâp ve Aka Kitabevleri.
  7. ↑ Rustow, Dankwart A. (1968). "Atatürk as Founder of a State". Daedalus. 97 (3). The MIT Press: 793–828. ISSN 0011-5266.
  8. ↑ Tarama dergisi: Osmanlıcadan Türkçeden söz karşılıkları (in టర్కిష్). Devlet Matbaası. 1934.
  9. ↑ Modern Türkiye'de siyası̂ düşünce (in టర్కిష్). İletişim. 2001. ISBN 978-975-05-0088-6.
  10. ↑ Dinç, Enis (2020-04-16). Atatürk on Screen: Documentary Film and the Making of a Leader (in ఇంగ్లీష్). Bloomsbury Publishing. ISBN 978-0-7556-0204-9.
  11. 1 2 Zadrożna, Anna (2017-07). "Reconstructing the past in a post-Ottoman village: Turkishness in a transnational context". Nationalities Papers (in ఇంగ్లీష్). 45 (4): 524–539. doi:10.1080/00905992.2017.1287690. ISSN 0090-5992. {{cite journal}}: Check date values in: |date= (help)
  12. ↑ Mango, Andrew (2002-08-26). Ataturk: The Biography of the Founder of Modern Turkey (in ఇంగ్లీష్). Harry N. Abrams. ISBN 978-1-58567-334-6.
  13. 1 2 Jackh, Ernest (2007-03). The Rising Crescent (in ఇంగ్లీష్). Read Books. ISBN 978-1-4067-4978-6. {{cite book}}: Check date values in: |date= (help)
  14. 1 2 Marcosson, Isaac Frederick (1938). Turbulent Years (in ఇంగ్లీష్). Books for Libraries Press. ISBN 978-0-8369-1305-7. {{cite book}}: ISBN / Date incompatibility (help)
  15. 1 2 "Turkey: The land a dictator turned into a democracy - TIME". www.time.com. Retrieved 2026-09-23.
  16. 1 2 H C Armstrong (1935). Grey Wolf Mustafa Kemal.
  17. ↑ Administrator. "Mustafa Kemal Ataturk – memorial museum in village Kodzadzik (Коџаџик) in Municipality Centar Zupa (Центар Жупа)" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2026-09-23.
  18. ↑ Fodor, Marcel William (1939). South of Hitler (in ఇంగ్లీష్). Houghton Mifflin.

మూలాలు

[మార్చు]
ముద్రణలు